ఎన్నికలు సమీపిస్తోన్న వేళ చంద్రబాబు దూకుడుపెంచారని తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. సరిగ్గా పనిచేయకపోయినా.. కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినా.. సదరు అభ్యర్థి గెలిల్చే గుర్రం కాదని అనిపించినా.. వెంటనే తీసి పక్కనపెడుతున్నారంట బాబు.
అవును… గెలుపు అనివార్యం అయిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా… మరోసారి నియోజకవర్గాల సమీక్షను మొదలుపెట్టారు. ప్రతిరోజు ఒక నియోజకవర్గం చొప్పున సమీక్ష చేస్తూ అవసరమై మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో… పనిచేయనివారిని.. యాక్టివ్ గా లేనివారిని.. ప్రత్యర్థి పార్టీలతో రాజీపడినట్లు అనిపిస్తోన్న నాయకులను తప్పించేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు పార్వతీపురం నియోజకవర్గం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిగా బోనెల విజయచంద్రను నియమించారు. నిన్నమొన్నటివరకు ఇన్ చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరంజీవులును తప్పించారు. కారణాలు చెప్పకపోయినా… తన కారణాలు తనకు ఉన్నాయన్నట్లుగా బాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తన మాటే శాసనం అని కన్ క్లూజన్ ఇస్తున్నారంట.
2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి చిరంజీవులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జోగారావు చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే గతకొంతకాలంనుంచీ చిరంజీవులు పార్టీలో యాక్టివ్ గా ఉండటం లేదని చంద్రబాబుకు సమాచారం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా… ఆయన్ని తప్పిస్తూ విజయచంద్రకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వలు జారీచేశారు. కొందరు కార్యకర్తలు చిరంజీవులు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి కారణం అని తెలుస్తోంది.
కాగా… రాబోయే ఎన్నికలు టీడీపీకి ఎంత ప్రతిష్టాత్మకమైనవనేది తెలిసిన విషయమే. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే పార్టీ మనుగడ్ద ప్రశ్నార్ధకం అనే విషయం మిగిలినవారికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. ఈ సారి గెలిచి నిలిస్తేనే ఫ్యూచర్… అలాకానిపక్షంలో టీడీపీ చరిత్ర పుటల్లో కలిసిపోబోతోంది అనుకున్నా అతిశయోక్తి కాదు!