ప్రస్తుతం ఏపీలో టీడీపీ – బీజేపీ – జనసేనలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ని ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు చేస్తున్న అవిరామ ప్రయత్నాల్లో ఇది కూడ ఒకటని అంటున్నారు. అయితే ఈ క్రమంలో ఫ్యూచర్ లో పవన్ తో కూడా తనకు, తనకు కుమారుడికి రాజకీయంగా సమస్యలు రాకుండా చంద్రబాబు సరికొత్త ప్లాన్ చేశారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హస్తినలో చంద్రబాబు, పవన్ లు బీజేపీ పెద్దలతో పొత్తు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒక వార్త మీడియాలో హల్ చల్ చేసింది. ఆ మేరకు మీడియాకు ఆ లీకు ఎవరో వ్యూహాత్మకంగానే ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేమిటంటే… రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కి పోటీ చేయబోతున్నారని.. గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని. అందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారని.
దీంతో ఈ వ్యవహారంపై కాపు సామాజికవర్గంలో ఒక అలజడి తీసుకొచ్చిందని చెబుతున్నారు. పవన్ ను వ్యూహాత్మకంగా రాష్ట్ర రాజకీయాలనుంచి తప్పించే ప్రక్రియలో భాగంగానే ఇది జరిగిందని.. ఇదంతా తన కుమారుడు లోకేష్ కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నమని.. ఇదంతా కావాలనే చేస్తున్నారని.. ఫ్యూచర్ లో లోకేష్ కు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా బాబు చేసిన పథక రచనలో ఇది భాగమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీచేయబోతున్నారనే విషయంపై హరిరామ జోగయ్య కూడా స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో కాపుల ఆధిపత్యాన్ని తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నంగా దీన్ని అభివర్ణించారు. పవన్ కల్యాణ్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే… లోకేష్ భవిష్యత్తు కోసం జనసేనను విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లవుతుందని తెలిపారు.
పైగా ఇలాంటి ఎదురుదెబ్బ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి టైం లో ఒకసారి జరిగిందని.. మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసవరమన్నట్లుగా ఆయన నొక్కి చెప్పారు. దీంతో… చంద్రబాబు వ్యూహాత్మకంగా కాపులను కొడుతున్న దెబ్బ ఇదంటూ ఒక చర్చ ఆ సామాజికవర్గంలో నడుస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఇంతోటి దానికి… “అసలే చీకటి గాడాంధకారం…” అని ప్రసంగిస్తూ పార్టీ పెట్టడం దేనికి పవన్ అని ప్రశ్నిస్తున్నారు కూడా!!