భారతీయ జనతా పార్టీ.. ఏ రాష్ట్రంలో అయినా ఇతర పార్టీల ప్రభుత్వాలు కొద్దిగా బలహీనంగా ఉన్నట్టు కనబడినా ఆ బలహీనతను మరింత ఎక్కువ చేసి ఏదో రకంగా అక్కడి ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వం ఏర్పడే వరకు నిద్రపోదు ఆ పార్టీ. అందుకు ఉదాహరణలే కర్ణాటకలో కూలిన కుమారస్వామి ప్రభుత్వం, మధ్యప్రదేశ్ నందు దిగిపోయిన కమల్ నాథ్ సర్కార్. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ ప్రభుత్వాలు కూలడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభకు మసకబారింది. ఎమ్మెల్యేల్లో తిరిగుబాటు తీసుకొచ్చి ప్రభుత్వాలను కూల్చడాన్ని బాగా అలవాటు చేసుకున్న బీజేపీ రాజస్థాన్ మీద కూడ అలాంటి వ్యూహమే పన్నింది. ఎప్పటి నుండో సీఎం అశోక్ గెహ్లాట్ వ్యవహారశైలి మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ సచిన్ పైలెట్ వర్గాన్ని మరింత రెచ్చగొట్టారు.
Read More : బ్రేకింగ్ : సుప్రీం కోర్టు బోనులో రామోజీరావు
తెర వెనుక రాజకీయం నడిపిన బీజేపీ పెద్దలు అశోక్ గెహ్లాట్ మీదికి సచిన్ పైలెట్ వర్గాన్ని ఎగదోశారు. పైలెట్ ద్వారా గెహ్లాట్ మీద తీవ్ర స్థాయి ఆరోపణలు చేయించి ముఖ్యమంత్రిగా గెహ్లాట్ ను దింపేసి తనను పీఠం మీద కూర్చోబెట్టాలనే డిమాండ్ లెవనెత్తించారు. అ డిమాండ్ నెరవేరదని సచిన్ పైలెట్ కి కూడ బాగా తెలుసు. పెద్ద వర్గం ఉన్న అశోక్ గెహ్లాట్ ను కాదని కేవలం తనతో కలిపి 19 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రిని చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ కూడా చేయదు. అలాచేస్తే ప్రభుత్వం కూలడం కాదు కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం అవుతుంది. అందుకే సోనియా, రాహుల్ ఇద్దరూ పైలెట్ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదని తేల్చి చెప్పారు. ఆ సమాధానాన్నే ఊహించిన బీజేపీ సచిన్ పైలెట్ ద్వారా తిరుగుబాటు బావుటా ఎగరవేసేలా చేసింది.
మొత్తం 19 మందితో సచిన్ పార్టీ నుండి వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీని రిసార్ట్ రాజకీయాలతో బెదిరించారు. అయినా అశోక్ గెహ్లాట్ బెదరలేదు. అధిష్టానం ఎమ్మెల్యేలను బుజ్జగించాలని ప్రయత్నించినా అశోక్ గెహ్లాట్ మాత్రం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లారు. దీంతో ప్రభుత్వం కూలడం ఖాయమని అందరూ భావించారు. బీజేపీ రాజకీయాలకు ఇంకొక రాష్ట్రంలో కాంగ్రెస్ కూలడం ఖాయమని అనుకున్నారు. పైలెట్ కూడా బీజేపీలోకి చేరడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు అన్ని తతంగాలు ముగిశాయని టాక్ వచ్చింది. రేపో మాపో సర్కార్ మారడం ఖాయమనుకున్నారు. కానీ మెల్లగా పరిస్థితి మారింది. హైకమాండ్ మంతనాలు ఫలించాయి.
సీఎం పదవి ఇవ్వలేం కానీ తొలగించిన డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పదవితో పాటు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని సచిన్ కు ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు చర్చలను ముమ్మరం చేశారు. సీనియర్ నేత అహ్మద్ పటేల్ రంగంలోకి దిగారు. గెహ్లాట్ నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్షమాపణ కోరితేనే తిరిగి పార్టీలోకి తీసుకోవాలనే నిర్ణయం జరిగిందట. ఎందుకంటే అసెంబ్లీలో బలపరీక్షకు నిలబడితే బీజేపీకి తమకు ఉన్న స్థానాల సంఖ్యలో తేడా చాలా తక్కవ. అందుకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకొక తప్పని పరిస్థితి. ఈమేరకు సీనియర్లు తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుసుకోనున్నారు.
Read More : మెగాస్టార్ రేంజును రామ్చరణ్ నిలబెట్టలేదా?
రాహుల్ గాంధీతో పైలెట్ సమగ్ర సమావేశం కోసం రంగం సిద్దమవుతున్నట్టు సమాచారం. పైలెట్ సైతం మునుపటి కంటే మెత్తబడి సీఎం పదవి డిమాండును మానుకున్నారని, ఫలితంగా రాజీ ఖాయమని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తానికి గెహ్లాట్ అనుసరించిన వ్యూహం హైలెట్ అనొచ్చు. పైలెట్ తిరుగుబాటు ప్రకటించాక గెహ్లాట్ ఎక్కడా మెత్తబడలేదు. ప్రభుత్వం కూలుతుందనే సంకేతాలు వచ్చినా పైలెట్ వర్గం మీద దాడి మానలేదు. ఫలితంగా గెహ్లాట్ కొరకరాని కొయ్యని పైలెట్ వర్గానికి తెలిసొచ్చి ఒక మెట్టు కిందికి దిగారు. అవతలి వ్యక్తి తగ్గాక వేరొకరైతే మరింత పట్టు బిగించి పంతం నెగ్గాలని అనుకుంటారు. కానీ గెహ్లాట్ అలా ఆలోచించలేదు. పైలెట్ తగ్గాడు కాబట్టి తానూ కోపం వదిలి క్షమాపణ కోరితే పైలెట్ వర్గాన్ని పార్టీలోకి తీసుకోవచ్చంటూ తుది నిర్ణయాన్ని హైకమాండుకు వదిలేశారు. దీంతో రాజీకి మార్గం సుగమం అయింది.
బీజేపీ వర్గాలేమో మధ్యప్రదేశ్ కమల్ నాథ్ తరహాలో అశోక్ గెహ్లాట్ కూడా రెచ్చగొడితే రెచ్చిపోతారని, పంతానికి పోయి ప్రమాదాన్ని ఆహ్వానిస్తారని ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా గెహ్లాట్ పట్టువిడుపుల వ్యూహం ముందు బీజేపీ ఎత్తుగడలన్నీ పటాపంచలయ్యాయి. ఫలితంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి అతి త్వరలోనే తెరపడనుంది.