తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం ఫార్ములా-ఈ రేసు (E-Car Race) వ్యవహారంపై స్పందిస్తూ, “ఈ కేసులో ఏమీ లేదని, నేను ఏ తప్పూ చేయలేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే నన్ను అరెస్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. నా నిజాయితీని నిరూపించుకునేందుకు నేను లై డిటెక్టర్ (Lie Detector) పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యేల రాజీనామా ఓ డ్రామా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కేటీఆర్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. “కడియం శ్రీహరిని కాపాడేందుకే దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం జరుగుతోంది. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, అది ప్రభుత్వానికి తీరని అవమానం అవుతుంది. ఆ ముప్పు నుంచి, పరువు పోకుండా తప్పించుకోవడానికే ముందుగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది,” అని కేటీఆర్ ఆరోపించారు.
ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలే.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ముందుగా జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాతే ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని ఆయన విమర్శించారు.

