ఎప్పుడో ఏభై ఏళ్ళక్రితం నటుడు నాగభూషణం తన ప్రసిద్ధి చెందిన “రక్తకన్నీరు” నాటకంలో చెప్పిన ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది. “ఉత్తరాదిన మతపిచ్చి…దక్షిణాదిన కులపిచ్చి. ఈ పిచ్చిని పిచ్చికుక్కను కొట్టినట్లు కొడితేగానీ ఈ దేశం బాగుపడదు” అంటాడు ఆయన. దేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ, ఆనాటి పరిస్థితిలో ఆవగింజంత మార్పు కూడా రాకపోవడమే గాక ఈ పిచ్చి మరింత ముదిరిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పతనానికి కారకులు ఎవరు అని ప్రశ్నించుకుంటే మొదటి ముద్దాయి రాజకీయరంగమే అవుతుంది.
మతపునాదుల మీద ఎదిగిన పార్టీ
జనతా పార్టీ విఫల ప్రయోగం తరువాత దానిలోనుంచి విడిపోయి 1980 లో జన్మించిన భారతీయ జనతా పార్టీ 1984 ఎన్నికల్లో గెల్చుకున్నది కేవలం రెండు సీట్లు మాత్రమే. ఆ తరువాత కూడా దాని ఎదుగుదల అంతంతమాత్రమే. మరొక పార్టీ ప్రభుత్వం ఏర్పరచాలనుకుంటే దానికి మద్దతు ఇచ్చే స్థాయికి ఎదిగింది. కానీ, దాని అసలు విస్తరణ రామజన్మభూమి, బాబరీమసీదు విధ్వసం అనే పునాదులతో మొదలైంది. ఆ తరువాత మూడేళ్ళలోనే మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఎదిగింది. అప్పట్లో అటల్ బిహారి వాజపేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి రాజనీతిజ్ఞులు, భాజపాకు సారధులుగా ఉన్నారు. ఎల్కే అద్వానీ భారతదేశం మొత్తం రథయాత్ర చేసి బీజేపీ కోటను పటిష్టంగా నిర్మించారు. ఇక మోడీ బీజేపీకి సారధిగా మారాక తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేశారు. ఆయనకు జతగా అమిత్ షా కలిశారు. ఇద్దరూ తమదైన శైలిలో పార్టీని ప్రభావితం చేసి, మూలపురుషులను మూలకు నెట్టేసి రెండు సార్లు కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకుని రాగలిగారు. ఎవరెన్ని మాట్లాడినా ఒక మనిషి సాధించిన విజయమే అతడిని శిఖరస్థాయికి తీసుకెళ్తుంది. ఆ రకంగా చూస్తే వాజపేయి, అద్వానీలు సాధించలేని విజయాన్ని నరేంద్ర మోడీ సాధించడంతో మోడీ భాజపాలో తిరుగులేని నాయకుడుగా మారారు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నత్త నడకే
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బీజేపీ ఉదయించిన రెండు సంవత్సరాలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఎవరెంత ఖండించినా తెలుగుదేశం పార్టీకి మొదట్లోనే కులముద్ర పడిపోయింది. ఎన్టీఆర్, నాదెండ్ల, ఉపేంద్ర, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీలో అతి ముఖ్యులు. వీరంతా కమ్మ సామాజికవర్గం వారే కావడం, పార్టీలో వీరిమాటే చెల్లుబాటు కావడం, ప్రభుత్వపరంగా జరిగిన అనేక నియామకాలు అన్నీ కమ్మ సామాజికవర్గం వారికే మాత్రమే పరిమితం కావడం ప్రజలు అలా భావించడానికి దోహదం చేశాయి.
అంతే కాకుండా, పటేల్, పట్వారి, కారణం, మునసబు వ్యవస్థలను రద్దు చెయ్యడం, బ్రాహ్మణులు అధిపతులుగా ఉన్న కొన్ని అకాడమీలను ఎన్టీఆర్ రద్దు చెయ్యడం ఇంకా అనేక కారణాలు తెలుగుదేశం పార్టీకి కులముద్రను బలంగా వేశాయి. అప్పట్లో బీజేపీలో ప్రముఖ యువనాయకుడుగా ఉన్న వెంకయ్యనాయుడు పార్టీ కన్నా, కులమే ప్రధానం అనుకుని బీజేపీ పురోగతిని అడ్డుకున్నారనే అభియోగాలు ఈనాటికీ వినిపిస్తుంటాయి. దేశమంతా అల్లుకునిపోయినా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ నత్తకన్నా నాజూకుగా నడుస్తుండటానికి కారణం వెంకయ్యనాయుడు, హరిబాబు లాంటి నేతలే అన్నది జగమెరిన సత్యం. ఆ విషయాన్ని గ్రహించే మోడీ చాలా తెలివిగా వెంకయ్యను మంత్రిపదవినుంచి తప్పించి ఉపరాష్ట్రపతి కుర్చీలో కుదేశారు. హరిబాబు చిరునామాను గల్లంతు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ ఏదో ఊడబొడుస్తాడని ఆశించి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఆయన కాస్తా చంద్రబాబుకు బానిసలాగా వ్యవహరించి పార్టీ ఆదేశాలను, విధానాలను ధిక్కరించి చంద్రబాబు భజనలు చేస్తూ పార్టీని సర్వనాశనం చేశారు. దాంతో కళ్ళు తెరిచిన అధిష్టానం సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా చేసింది.
వీర్రాజు దూకుడు
ఇప్పుడు బీజేపీ ముందున్న అజెండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ అధికారంలోకి రావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సహజమైన ఆశయమే. ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడమే. అయితే ఇది ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాతీర్పుతో జరగాలి. కానీ, బీజేపీ అంతరంగం మరొకరకంగా ఉన్నది. తెలంగాణ భాజపా సారధి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ సారధి సోము వీర్రాజు ఇద్దరూ కరుడుగట్టిన ఆరెస్సెస్ వాదులు. చురుకైన వారు. పార్టీ కోసం కష్టపడేవారు. అధికారపార్టీ నేతలతో వీరికి లోపాయికారీ ఒప్పందాలు ఉండవు. ఇద్దరూ డైనమిక్ అని చెప్పాలి. మొదటినుంచి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ బలం ఎక్కువే. అక్కడ పార్టీకి మంచి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. పార్లమెంట్ కు నలుగురు సభ్యలు ఎన్నికై పార్టీని పటిష్ట స్థితిలో ఉంచారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు విరుద్ధం. అక్కడ ఆ పార్టీకి ఒక్క పంచాయితీ వార్డ్ మెంబర్ కూడా లేరు.
విజయానికి అడ్డదారులా?
మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు నలభై శాతం. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ఓటు బ్యాంకు యాభై శాతం. బీజేపీకి ఒకటికన్నా తక్కువ శాతం. అలాంటి పరిస్థితుల్లో బీజేపీఅధికారం చేపట్టడం కలలోని మాట. అందుకే బీజేపీ అడ్డదారులు వెతుకుతున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రజల్లో ఉండే మత భావనలను సోపానాలుగా చేసుకుని ఎదగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎక్కడ దైవానికి, ఆలయాలకు సంబంధించి స్వల్పసంఘటనలు జరిగినా దానిని ఆసరాగా చేసుకుని ప్రజలను రెచ్చగొట్టి పురోగమించాలని తలపోస్తున్నట్లుంది. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తుంటే దీనివెనుక బీజేపీ కుట్ర ఉన్నదా అనే సందేహం సామాన్యులకు కలుగుతున్నది. అధికారం కోసం బీజేపీ ఎంతటి నైచ్యానికైనా బరితెగిస్తుందని గతంలో అనేకసార్లు రుజువయింది.
ఇద్దరు ముఖ్యమంత్రులూ అప్రమత్తంగా ఉండాలి
బీజేపీకుటిల రాజకీయాలను ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఎదుర్కోవాలి. తమలో తమకు ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటె వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటూ బీజేపీ దుష్ట రాజకీయాలకు అడ్డుకట్ట వెయ్యాలి. అదృష్టం ఏమిటంటే, ఉత్తరాదిన ఉన్నంతగా దక్షిణాది రాష్ట్రాల్లో మతపిచ్చి లేదు. అయితే భవిష్యత్తులో పొటమరించదని భావించడానికి కూడా వీలు లేదు. కాబట్టి కేసీఆర్, జగన్ ఇద్దరూ సంయుక్తంగా చర్చించుకుంటూ బీజేపీకి ముకుతాడు వెయ్యాలి. మతరాజకీయాలను నిరోధించాలి. ఒకసారి మతం ప్రవేశించిందంటే ఇక శాంతిభద్రతలకు ఆయువు మూడినట్లే.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు