Pomegranate: రోజూ దానిమ్మ గింజలు తింటే.. గుండె, మెదడుకి ఏమవుతుందో తెలుసా..?

ఆరోగ్యానికి పండ్లు మంచివనే సంగతి అందరికీ తెలుసు. కానీ కొన్ని పండ్లు మాత్రం శరీరాన్ని పూర్తిగా లోపల నుంచి మార్చేసే శక్తి కలిగి ఉంటాయి. అలాంటి శక్తివంతమైన ఫలాల్లో దానిమ్మ ఒకటి. ముఖ్యంగా దానిమ్మ గింజలు శరీరానికి ఇచ్చే లాభాలు ఇప్పుడు సైన్స్ మాత్రమే కాదు, ఆయుర్వేద నిపుణులూ ఒకే మాట చెబుతున్నారు.. ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య రక్షక కవచం.

దానిమ్మ గింజలు మన శరీరంలోని వాత, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల రక్తం శుద్ధి అవుతుంది, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా గుండె మరింత ఆరోగ్యంగా పనిచేస్తుంది. రక్తకణాల ఉత్పత్తి పెరిగి శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. అంతేకాదు, ఇందులో ఉండే నీటి శాతం వల్ల ఇది సహజ హైడ్రేషన్‌గా కూడా పనిచేస్తుంది.

కొన్ని ఆరోగ్య నివేదికల ప్రకారం దానిమ్మ గింజలు బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో, అలాగే హైపర్ గ్లైసిమియాను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని వాపులు, లోపలి గాయాలు త్వరగా తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పాలీఫెనల్స్‌, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ కర్సీనోజెనిక్ లక్షణాలు ఉన్న ఈ గింజలు సెల్ అభివృద్ధికి కూడా బలంగా తోడ్పడతాయి.

నిత్యం దానిమ్మ గింజలు తీసుకునే వారి జీర్ణవ్యవస్థ మరింత బలంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా ఇది సహకరిస్తుంది. గాల్‌బ్లాడర్ పనితీరును మెరుగుపరచి ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

శరీరానికి తక్షణ శక్తి కావాలంటే దానిమ్మ గింజలకంటే మంచి ఎంపిక ఇంకొకటి లేదన్నమాట. ఇందులో చక్కెర స్థాయి మోతాదులోనే ఉండటం వల్ల ఎనర్జీని పెంచుతుంది కానీ షుగర్‌ను ఒక్కసారిగా పెంచదు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచి అలసటను తగ్గిస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా ఇది రక్షణగా పనిచేస్తుందని వైద్యుల అభిప్రాయం.

చర్మం కాంతివంతంగా మెరవాలంటే బయట క్రీములకన్నా లోపలి పోషకాలు చాలా ముఖ్యం. దానిమ్మ గింజల్లో ఉన్న విటమిన్ సీ చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు రావడం ఆలస్యం చేస్తుంది. ఇందులో సహజంగా ఉండే ఎలాజిక్ యాసిడ్, పనికాలజిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకుంటాయి. ముఖంపై మచ్చలు, గీతలు పడకుండా కాపాడుతాయి.

ఇక గుండె విషయానికి వస్తే, దానిమ్మ గింజల్లోని పాలీఫెనల్స్, ఫ్లేవనాయిడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడతాయి. హైపర్ టెన్షన్‌ను కూడా అదుపులో ఉంచే గుణం ఉండటంతో గుండెపోటు ముప్పు తగ్గుతుంది. మెదడుపైనా దానిమ్మ గింజల ప్రభావం చాలా ఆసక్తికరమైనది. మెదడులో వచ్చే వాపును తగ్గించి బ్రెయిన్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఆల్జీమార్ వంటి సమస్యలను కూడా ఇది కొంతవరకు ఎదుర్కొనే శక్తిని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా భయపడకుండా మోతాదులో దానిమ్మ గింజలు తీసుకోవచ్చు. ఇందులో గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉండటం వల్ల షుగర్‌ను ఒక్కసారిగా పెంచదు. ఇన్సూలిన్ నిరోధకతను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. విటమిన్ సీ పుష్కలంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాడే శక్తి కూడా ఇందులో ఉంది. అందుకే ఇప్పుడు వైద్యులు, ఆయుర్వేద నిపుణులు ఒకటే సూచిస్తున్నారు.. రోజూ గుప్పెడు దానిమ్మ గింజలను ఆహారంలో తప్పక చేర్చుకోవాలని.