ఇప్పటి వరకు గొలుసులు, రుద్రాక్ష మాలలు, క్రిస్టల్ చైన్స్ మాత్రమే ట్రెండ్ ఉండేవి.. అయితే ఇటీవలి కాలంలో ఆ జాబితాలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది కరుంగలి మాల. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఈ మాలను ధరించడం చూస్తున్నాం. కొందరైతే దీన్ని ఫ్యాషన్‌గా తీసుకుంటున్నారు. మరికొందరు భక్తిశ్రద్ధలతో ధరిస్తున్నారు. కానీ జ్యోతిష్య పండితుల మాట ప్రకారం.. కరుంగలి మాల సాధారణ ఆభరణం కాదు, ఇది కర్మతో ముడిపడిన శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం.
జాతకంలో 6వ స్థానం మన గతజన్మ కర్మలకు సూచకంగా చెబుతారు. మనం అనుభవిస్తున్న కష్టాలు, అడ్డంకులు, ఆకస్మిక సమస్యలు అన్నీ అక్కడి కర్మ ఫలితాలేనని జ్యోతిష్యం చెబుతోంది. అలాంటి అనవసరమైన కర్మ ప్రభావాలను తగ్గించడంలో కరుంగలి మాల కీలక పాత్ర పోషిస్తుందని పండితుల విశ్లేషణ. ఈ మాలను సరైన నియమాలతో ధరిస్తే జీవితం ప్రశాంతంగా మారుతుందని, ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుందని వారు చెబుతున్న మాట.
అయితే ఈ మాల ధరించేవారు ఒక ముఖ్యమైన నియమాన్ని గట్టిగా పాటించాలి. అది నిజాయితీ. అబద్ధాలు, మోసాలు, మాటల ద్వంద్వత్వం కరుంగలి మాల శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయట. శుక్రుడు వాక్కుకు ఆధిపతి అయితే, శని కర్మలకు కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. శని ప్రభావంతో సంబంధం ఉన్న ఈ మాలను ధరించినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలకు దూరంగా ఉండాలన్నది పండితుల స్పష్టమైన హెచ్చరిక.
మాల ధారణకు ముందు మంత్రజపం కూడా తప్పనిసరి అని అంటున్నారు. “ఓం స్కందాయ నమః” అనే మంత్రాన్ని రోజూ పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మాలలోని శక్తి చైతన్యవంతమవుతుందని విశ్వాసం. ముఖ్యంగా నలభై ఒక్క రోజులపాటు నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన ఫలితాలు కనిపిస్తాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. బుధ, గురు, శుక్ర, శని వారాల్లో లేదా పంచమి, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి వంటి శుభ తిథుల్లో మాలను ధరించడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.
కరుంగలి మాల మన శరీరంలోని శక్తిని ఉత్తేజపరుస్తుందని, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. అయితే అపవిత్రమైన సందర్భాల్లో, ముఖ్యంగా టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు ఈ మాలను తీసివేయాలని పండితుల హెచ్చరిక. కులమత భేదం లేకుండా ఎవరికైనా ఈ మాలను ధరించే అర్హత ఉన్నప్పటికీ, నియమాలు పాటించని వారికి ఆశించిన ఫలితాలు రావని వారు స్పష్టంగా చెబుతున్నారు. మొత్తానికి ఫ్యాషన్ కోసం కాకుండా, భక్తితో, నియమాలతో కరుంగలి మాలను ధరిస్తే జీవన ప్రయాణమే మారుతుందనే నమ్మకం ఇప్పుడు లక్షల మంది మనసుల్లో చోటు చేసుకుంటోంది.
