తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలతోపాటు.. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా… ఆయన రాకను నిరసిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం గుంటూరుతో పాటు ఏపీలోనూ ఇది హాట్ టాపిక్ గా మారింది.
అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. ఆయన పాలనలో అవినీతిని, గతంలో ఇచ్చిన హామీలను, చేసిన మోసాలను ప్రస్తావిస్తూ… “సిగ్గు.. సిగ్గు..” అంటూ అమరావతి పట్టణం మొత్తం ఫ్లెక్సీలు వెలిశాయి.
రుణమాఫీ పేరుతో రైతుల గొంతు కోసిన నీ ప్రభుత్వం ఎక్కడ..? పెట్టుబడి సాయం, పంట బీమాతో రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలుస్తున్న జగనన్న పాలన ఇక్కడ!
600 హామీలతో అందుబాటులో లేని నీ మేనిఫెస్టో ఎక్కడ..? నవరత్నాలతో 98 శాతం హామీలను అమలు చేసిన మా జగనన్న మేనిఫెస్టో ఇక్కడ!
డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని నిట్టనిలువునా ముంచిన నీ ప్రభుత్వం ఎక్కడ..? ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళాభ్యుదయానికై సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, వంటి పథకాలను అమలుచేస్తున్న మా జగనన్న ప్రభుత్వం ఇక్కడ!
దళితులుగా పుట్టడం తప్పా.. చెప్పండి చంద్రబాబు, లోకేశ్‌బాబు..? మా జగనన్న సంక్షేమ పాలనలో మేం దళితులుగా పుట్టినందుకు గర్విస్తున్నాం! అంటూ నలుపురంగులో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ప్రత్యక్షమవుతున్నాయి.
ఇలా గత ప్రభుత్వంలో జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై వెలిసిన ఈ ఫ్లెక్సీలపై తీవ్ర చర్చనడుస్తుంది. దీంతో… ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ కార్యకర్తలు అమరావతిలో ధర్నా చేపట్టారు.