ఓడలు బళ్లూ బళ్లు ఓడలూ అవుతుంటాయని అంటారు! ఇక రాజకీయాల్లో అయితే ఇది అత్యంత సహజం. కాకపోతే అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని పార్టీలు మరీ పతనావస్థకు పోతుంటాయి. ఇందులో భాగంగా… అధికారంలో చేసిన శృతిమించిన పనుల ఫలితాలు బలంగా తిరిగివచ్చేస్తుంటాయి. ఆ సంగతి అలా ఉంటే… ఒకప్పుడు భారీ వైభవం చూసిన టీడీపీ ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యంలేని పార్టీగా మిగిలిపోయింది.
అవును… చంద్రబాబు ఆధీనంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఘోర అవమానం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా… పెద్దల సభలో టీడీపీకి ఇక జీరో నంబరే మిగలనుంది. దీంతో… ఇది ఆ పార్టీ చరిత్రలోనే అతి ఘోరమైన అవమానంగా విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఈ విషయంలో కనీసం ఒక్కస్థానం అయినా దక్కించుకోవడానికి చంద్రబాబు ఏమాత్రం సాహసించే విషయంలో సిద్ధంగా లేరని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఈదఫా రాజ్యసభకు పోటీచేసే విషయంలో నో చాన్స్ అంటూ సీనియర్ల ముందే చేతులెత్తేశారు. నేటితో రాజ్యసభ అభ్యర్ధుల నామినేషన్ల దాఖలుకు చివరి గడువుగా కావడంతో… దానికి ఒక్క రోజు ముందు చంద్రబాబు తన మనసులోని మాటను పార్టీ నేతలతో పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టి సాహసం చేయలేమని స్పష్టం చేశారు.
దీంతో… పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా టీడీపీకి ఈ గతి పట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో ఏమాత్రం టెన్షన్ లేకుండా మూడుకు మూడు రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా గెలవడం అన్నది ఇక వైసీపీకి లాంచనం అయిపోయినట్లే!
వాస్తవానికి నిన్నమొన్నటివరకూ రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టేందుకు బాబు సిద్ధమవుతున్నారని ఒకరంటే… వైసీపీ నుంచి సుమారు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బీరాలు పలికిన టీడీపీ నేతలు ఇంకొందరు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యసభకు టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని పంపుతామని.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు అందుకు రెడీగా ఉన్నారని కూడా చెప్పుకున్నారు. అయితే… అది అంత ఈజీ కాదని చంద్రబాబు తొందరగానే తెలుసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో టీడీపీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు. అయినప్పటికీ… గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు రావడంతో 23 నంబర్ సరిపోయింది. అయితే… తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించి షాక్ ఇచ్చారు. దీంతో నెంబర్ 22కి పడిపోయింది.
ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపైనా అనర్హత కత్తి వేళాడుతూ ఉంది. అదే జరిగితే మళ్లీ టీడీపీ నెంబర్ 18కి పడిపోతుంది. అయితే… 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే తప్ప రాజ్యసభ సీటు దక్కదు.. అంటే ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలి.
ఇది ప్రాక్టికల్ గా జరిగే విషయం కాకపోవడంతో… నిన్నటివరకూ హడావిడి చేసిన టీడీపీ నేతలు కిమ్మనకుండా గమ్మునున్నారని తెలుస్తుంది. దీంతో… తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత ఫస్ట్ టైం రాజ్యసభలో జీరో నంబర్ తో కనిపించబోతుంది. అంటే… బాబు ప్రెసిడెంట్ గా ఉన్న టైం లో ఇది మరో బ్యాడ్ రికార్డ్ అని అంటున్నారు పరిశీలకులు.