ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు ఉన్న పేరు ఎలాంటిదో మనకు తెలుసు. 50 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం.. నిర్వహణ ఏర్పాట్లకు ఓ రోల్ మోడల్‌గా నిలుస్తుంది. రోజూ కొన్ని లక్షల మంది భక్తులు సందర్శించే జన జాతర అది. ఇది అర్ధ కుంభమేళా. ఆరేళ్లకోసారి నిర్వహిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని నరేంద్రమోడీ, ఆ రాష్ట్ర మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకను ప్రారంభించారు.
ఈ నెల 21న పౌష్య పున్నమి, వచ్చేనెల 4న మౌని అమావాస్య, 10న బసంత పంచమి, 19న మాఘ పున్నమి, మార్చి 4న మహా శివరాత్రి.. ఈ కుంభమేళాలోని కీలక ఘట్టాలు. ఈ 50 రోజుల వ్యవధిలో కనీసం రెండున్నర కోట్ల మంది భక్తులు మంగళ స్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమం ఈ ప్రదేశం. సరస్వతి నదీమతల్లి కంటికి కనిపించదు. ఈ నది అంతర్వాహిణి. సూర్యుడు, బృహస్పతి గ్రహం స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం ఆనవాయితీ.
దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను ప్రయాగ లోను నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభ మేళాను నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ లోను, సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను ఏర్పాటు చేస్తారు.బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ ఉజ్జయిని సమీపంలోని క్షిప్రా నది వద్ద కుంభమేళాను నిర్వహిస్తారు.
కుంభమేళా అంటే నాగా సాధువులకు ప్రత్యేకం. దేశం నలుమూలలా ఉన్న వారందరూ కుంభమేళాలో కనిపిస్తారు. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభ మేళా జరుగుతుంది. 144 ఏళ్లకోసారి (12 పూర్ణ కుంభ మేళాల తర్వాత) మహా కుంభమేళా నిర్వహిస్తారు. 2013లో మహా కుంభమేళా జరిగింది.
ఇప్పుడు జరుగుతున్నది పేరుకు మాత్రమే అర్ధ కుంభ మేళా. దీనికి 2013 మహా కుంభమేళా కంటే ఎక్కువ మంది తరలివస్తారని అంచనా. భక్తుల కోసం నది పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో గుడారాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు వేలాది మంది అధికారులు రాత్రింబవళ్లు దశలవారీగా శ్రమిస్తున్నారు.
దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండటానికి వేసిన టెంట్ల కోసం దాదాపు 6,000 సంస్థలు స్థలాన్ని కేటాయించారట. ఈ వేడుక కోసం 4,200 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నట్లు అంచనా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
30 వేల మందికి పైగా పోలీసులతో పాటు, పారామిలిటరీ బలగాలను కూడా మోహరింపజేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. జనాల కదలికలను పరిశీలించేందుకు తొలిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగిస్తున్నారు. కుంభమేళా కోసం ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వివరాలూ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వెయ్యి సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నారు పోలీసులు.
కుంభమేళా ప్రాంతంలో వంద పడకల ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా మరో 10 క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 193 మంది డాక్టర్లు, మరో 1500 మందికి పైగా నర్సులు రౌండ్ ద క్లాక్ తరహాలో పనిచేస్తారు.
86 అంబులెన్సులు, 9 రివర్ అంబులెన్సులు, ఒక ఎయిర్ అంబులెన్సు కూడా అందుబాటులో ఉంచారు. అలాగే- స్వచ్ఛ కుంభమేళాలో భాగంగా 1,22,000 టాయిలెట్లు, 20,000 చెత్త బుట్టలు ఏర్పాటు చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 22,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.
ఫొటో కర్టెసీ: కుంభమేళా అధికారిక వెబ్‌సైట్