ఆడుదాం ఆంధ్ర.! వైఎస్ జగన్ డబుల్ ధమాకా.!

ప్రభుత్వంలో ఎవరున్నా.. ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, అవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమే. ఇప్పుడున్న రాజకీయాలే అంతే.! ఎవరు అధికారంలో వున్నా ఇదే పరిస్థితి. ఇందులో కొత్తగా ఎవర్నీ ప్రత్యేకంగా తప్పు పట్టే పరిస్థితి లేదు, సమీప భవిష్యత్తులో వుండదు కూడా.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం, గ్రామీణ స్థాయి క్రీడాకారుల్ని సైతం, ప్రపంచానికి పరిచయం చేయడమే.! వారిలోని టాలెంట్‌ని వెలికి తీయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.

అయితే, ఎన్నికలకు ముందర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక రాజకీయ కోణం కూడా సుస్పష్టం. యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఇలాంటి కార్యక్రమాలతో. ఇది ఓ రకంగా వైసీపీకి ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ లాంటిదని అనుకోవచ్చు. స్వామి కార్యం.. స్వకార్యం.. అంటారు కదా.! అలాంటిదే ఇది కూడా.

క్రికెట్ కిట్లు సహా, వివిధ స్పోర్ట్స్‌కి సంబంధించిన పరికరాలపై వైఎస్ జగన్ బొమ్మని ముద్రించి, క్రీడాకారులకి అందజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఈ క్రీడలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే, సంక్రాంతి పండక్కి ముందు, రాష్ట్రంలో క్రీడా పండుగ వాతావరణం అన్నమాట. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా క్రీడా సంబరం జరగలేదన్నది నిర్వివాదాంశం.

రాజకీయాల్ని పక్కన పెడితే, ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. అప్పుడే, ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ముందే చెప్పుకున్నట్టు అటు యువతకూ మేలు జరుగుతుంది.. ఇటు వైసీపీకీ రాజకీయంగా లబ్ది చేకూరుతుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే.! వైఎస్ జగన్ డబుల్ ధమాకా అన్నమాట.!