వైఎస్ జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయా?

YS Jagan not spending enough on Irrigation Projects ?

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసి సాగునీటి పథకాలకు కేటాయింపుల్లో దాదాపు పది శాతం కోత విధించింది. ఫలితంగా మెట్ట ప్రాంతాల్లోని ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా మెట్ట ప్రాంతమైన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. సీమ ప్రాజెక్టులకు అంతంత మాత్రంగా కేటాయింపులు జరిగాయి. అంతే కాదు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో 52 శాసన సభ స్థానాలుంటే 49 స్థానాలు వైకాపాకు కట్ట బెట్టారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సీమ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని నిధులు ఇబ్బిడికిబ్బిడిగా కేటాయించుతారని ఆశించిన సీమ ప్రజలు నిరాశకు గురైనారు. దీనికి తోడు పెద్ద ఆర్భాటంగా ప్రకటించిన పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం వివాదంలో పడ్డాయి. అప్పుడే సీమలోని ఒక వర్గం “భ్రమలు” వీడాలి అనే భావనకు వచ్చింది

ఇప్పటికే రెండు బడ్జెట్ లు పూర్తయ్యాయి. ఆ మాట కొస్తే ఒక్క రాయలసీమ సీమలోనే కాదు. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులపై రాష్ట్రం మొత్తం మీద అసంతృప్తి వెల్లు వెత్తింది.ఈ నేపథ్యంలో జరిగిన నష్టం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి సాగునీటి రంగంపై సమీక్ష చేసి రాష్ట్ర ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి పోగొట్టేందుకు కొత్త పథకం తెర మీదకు తెచ్చారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ విహికల్ సంస్థలను ఏర్పాటు చేసి వివిధ సంస్థల వద్ద భారీగా రుణాలు పొందాలని నిర్ణయించారు. ఈ నిర్ణయమైతే బాగుంది. కాని ఆచరణలో ఇది అమలు అంత సులభం కాదు. పైగా రాయల సీమకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు విదేశాల నుండి గాని జాతీయ స్థాయిలో హడ్కో లాంటి సంస్థల నుండి గాని రుణాలు పొందే అవకాశం లేదు.

ప్రపంచ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇంకా జపాన్ కు చెందిన జైకా లాంటి సంస్థల నుండి రుణాలు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణాలు లభిస్తాయి. కేంద్రం అనుమతి ఇవ్వాలంటే ఆ పథకాలకు కేంద్ర జల సంఘం అనుమతి వుండాలి. కేంద్ర జల సంఘం అనుమతి లభించాలంటే నీటి కేటాయింపులతో పాటు పర్యావరణం ఇతర అనుమతులు వుండాలి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు వుండ కూడదు. అంతేకాదు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి రుణాలు పొందాలన్నా ఇవన్నీ తప్పని సరి.

కాకుంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు డిపాజిట్ చేయబడే బ్యాంకులు మొహమాటంతో పరిమితంగా రుణాలు ఇవ్వ వచ్చు. ఇప్పుడు ప్రతి పాదించిన పథకాలకు భారీ గా రుణాలు అవసరమౌతాయి. అంతర్జాతీయ జాతీయ స్థాయిలోని సంస్థల రుణాలపై విధించే వడ్డీ తక్కువగా వుంటుంది. బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. రుణాలు చెల్లించే కాల పరిమితిలోనూ తేడా వుంటుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పథకాలకు సరి పోయే విధంగా బ్యాంకులు రుణాలు ఇచ్చే స్థితిలో వుండవేమో. గతంలో అన్ని అనుమతులు వున్నందున శ్రీ శైలం కుడి కాలువకు ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చింది. ప్రస్తుతం రాయలసీమలో ప్రతిపాదించ బడిన పథకాలకు ఆ సౌలభ్యం లేదు.

రాష్ట్రంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తోంది. తుదకు హైకోర్టు కూడా కామెంట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే వారు లేరా?ఉన్నా సరైన సలహా ఇవ్వ లేకున్నారా? తుదకు ఎవరైనా సలహా ఇస్తే అమలు జరగడం లేదా?సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేయబడిన కార్పొరేషన్ అంశంలో ఈ అనుమానం వస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు సందర్భంగా ఈ అంశాలు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు.? ఇవన్నీ శేష ప్రశ్నలుగా వున్నాయి.

దురదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలను పరిష్కరించడం అసాధ్యమని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజమౌతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా వుంటే తప్ప అటు గోదావరి ఇటు కృష్ణ నదులపై ఎవరు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా తగాదా తప్పదు. జంట కవలుగా పుట్టిన వాణి వీణలను విడదీయడం ఎంత కష్టమో సాగునీటి రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల అంశం అంతే. చంద్రబాబు నాయుడు హయాం గడచి పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితి మెరుగు పడింది. ఇద్దరు ముఖ్యమంత్రులు భాయ్ భాయ్ అనుకున్నారు. తిరిగి హఠాత్తుగా కథ మొదటికి వచ్చింది. ఫలితంగా ఎవరు ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా నీటి కేటాయింపులు జఠిల సమస్యగా వస్తోంది. నీటి కేటాయింపులు లేకుండా ఎవరికి గాని కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వదు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ఫిర్యాదుపై గోదావరి కృష్ణ నదులపై కేంద్ర జల సంఘం వద్ద డిపిఆర్ ఆమోదం పొందని తెలంగాణకు చెందిన అన్ని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించి నిర్మాణాలు నిలుపుదల చేయమని కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయి.

కేంద్రం ఆదేశాలు ఎంత వరకు అమలు అవుతాయో అనే అంశం పక్కన పెడితే కొత్త ప్రాజెక్టులకు మాత్రం ఈ ఆదేశాలు తల కింద గుండుగా వుంటుంది ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం ఏవేవో సాకులు చూపెట్టి తన స్వంత నిధులతో ఇప్పటిలాగే పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు కొన సాగించ వచ్చు. కాని ఆంధ్ర ప్రదేశ్ వచ్చే సరికి ఆర్థిక పరిస్థితి తలకిందులుగా వున్నందున రాష్ట్ర ప్రభుత్వ నిధులు భారీగా వ్యయం చేసే పరిస్థితి లేదు. అదే సమయంలో కేంద్ర జల సంఘం అనుమతి లేనందున ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు పక్కన పెట్టినా కేంద్ర సంస్థ హడ్కే లేదా నాబార్డు ఇతర సంస్థల నుండి రుణాలు పొందే అవకాశాలు లేవు. అవి సవాలక్ష ప్రశ్నలువేసి అనుమానం తీరిన తర్వాతనే రుణాలు ఇస్తాయి. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి రాజధానికి రుణం మంజూరు చేసే విషయంలో ప్రపంచ బ్యాంకు వ్యవహరించిన తీరు మనకు తెలుసు. ఎంత మంది పరిశీలకులు వచ్చారో చెప్ప పని లేదు. ఏతా వాతా తేలేదేమంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినా రుణాలు పొంది ప్రాజెక్టులు నిర్మించడం చాలా కష్ట సాద్యమే.

అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన్యతలు వేరుగా వున్నాయి. బడ్జెట్ కేటాయింపులు చూస్తే అవగతమౌతుంది. ఈ ఏడు సంక్షేమ పథకాలకు 41 142 కోట్లు కేటాయించారు. అదే సమయంలో గత ఏడాది కన్నా తగ్గించి 11 805 కోట్లు మాత్రమే సాగు నీటి రంగానికి కేటాయించారు. వాస్తవంలో బడ్జెట్ కేటాయింపులు పూర్తి స్థాయిలో విడుదల చేయడమే గొప్ప. మొదలే కేటాయింపుల్లో కోత పెడితే సంవత్సరం ఆఖరుకొచ్చే సరికి ఏన్నో కటింగ్ లు పడతాయి. ఇందుకు గత సంవత్సరం సాగు నీటి రంగం నిధుల విడుదలే ప్రత్యక్ష నిదర్శనం. ప్రధానంగా మెట్ట ప్రాంతం వారిని సంతృప్తి పర్చడానికి కార్పొరేషన్ తంతు తెర మీదకు తెచ్చారు. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు