జనవరి 9న జగన్ సంచలన ప్రకటన

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో సంచలన ప్రకటన చేయనున్నారు. గతేడాది నవంబరు 6 న ఇడుపులపాయలో మొదలైన ప్రజాసంకల్పయాత్ర ముగింపుదశకు చేరుకుంది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలకు అత్యంత చేరువగా ఉండే దిశగా ఆయన పాదయాత్ర చేపట్టారు. జనవరి తొమ్మిదవ తేదీన ఆయన పాదయాత్ర ముగియనున్నట్టు తెలుస్తోంది. ఆరోజు జరగనున్న భారీ బహిరంగ సభలో ఎన్నికలకు సంబంధించి జగన్ ఒక సంచలన ప్రకటన చేయనున్నట్టు సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చదవండి.

జగన్ ప్రజాసంకల్ప యాత్ర చివరి దశకు చేరుకుంది. ఇడుపులపాయలో మొదలైన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. ఈ సందర్భంగా నేతలు ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులలో నిమగ్నమయ్యారు వైసీపీ శ్రేణులు. ఈ సభకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నారు. అయితే ఇదే వేదికగా జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు అని తెలుస్తోంది.

బహిరంగ సభలోనే అభ్యర్థుల ప్రకటన

ఫిబ్రవరి చివరి వారం లేదా మర్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల ముందే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్న అభ్యర్థులను ప్రకటించనున్నారు జగన్. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదుపరి ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను సంక్రాంతితర్వాత విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆయనకంటే ముందే జగన్ జనవరి 9 న వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ఈ తరుణంలో వైసీపీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ నుండి పోటీ చేయనున్న అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చారు జగన్. కాగా కొన్ని చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నవారిని మార్చి కొత్తవారిని నియమించడంపై అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. మార్పులు చేర్పులు చోటు చేసుకున్న పరిణామంలో ఎవరి సీటుకి గ్యారెంటీ ఉందో ఎవరి సీటు గల్లంతో అని నేతలు లోలోపల మదన పడుతున్నారు. నాయకుల బాధ ఇలా ఉంటే… తాము అభిమానించే నాయకులకు టికెట్ వస్తుందో రాదో అని వారి క్యాడర్ కూడా టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.