Ganta Srinivasa Rao: వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే గంటా సవాల్

వైసీపీ నాయకత్వానికి భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గట్టి సవాల్ విసిరారు. వైసీపీ తన ఐదేళ్ల పాలనలో మొదలుపెట్టి, పూర్తి చేసి, ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ సవాల్ చేశారు.

గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కియా వంటి ఒక్క పెద్ద కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని ఆయన ఆరోపించారు.

అదేవిధంగా, గత వైసీపీ ప్రభుత్వం సూటు, బూటు వేసిన ఫేక్ ప్రతినిధులతో పెట్టుబడుల సదస్సు నిర్వహించి, రాష్ట్ర పరువు తీసిందని గంటా ధ్వజమెత్తారు. ఆ ఉత్తుత్తి ఒప్పందాల బండారాన్ని సోషల్ మీడియా బయటపెట్టిందని గుర్తుచేశారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మాట్లాడిన గంటా శ్రీనివాసరావు, ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుతో ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారని, దీని ద్వారా ఇంధనం, ఐటీ, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా 13 కీలక రంగాల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్‌తో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ విశ్వసనీయత ఉన్న కంపెనీలకే సదస్సులో అవకాశం కల్పించారని గంటా పేర్కొన్నారు.

Cine Critic Dasari Vignan Review On Varanasi || Mahesh babu || Priyanaka Chopra || Raja Mouli || TR