అమరావతి మరో తిరుమల అవుతుందా? జనవరి 31 న భూమి పూజ

పక్కనే తిరుమల లో కలియుగ వైకుంఠంగా వర్ధిల్లుతూ శ్రీ వేంకటేశ్వర స్వామిదేవాలయం ఉన్నపుడు ఆంధ్ర రాజధాని అమరావతిలో మరొక వెంకటేశ్వర ఆలయం కట్టడం అవసరమా. అక్కడ 25 ఎకరాలలో 150 కోట్ల ఖర్చుతో దేవాలయానికి జనవరి 31 న భూకర్షణ పూజ చేస్తారు.

టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘల్ ఈ ఏర్పాట్ల పనిమీద నిన్న అమరావతి వచ్చారు. ఆలయ కాంప్లె క్స్ లో ఆలయంతో పాటు, ఒక కల్యాణ మంటపం,ఒక  ఆడిటోరియం ఉంటాయని చెప్పారు.

ఆలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన భూమిని సింఘల్ పరిశీలించారు.

జనవరి 31 ఉదయం 9.15 – 9.45 మధ్య భూమిపూజకు ముహూర్తం నిర్ణయించారు.ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు.

కృష్ణా నది ఒడ్డున వైకుంఠ పురం సమీపంలో ఈ ఆలయం నిర్మించాలని ముఖ్యమంత్రే స్థల నిర్ణయం కూడా చేశారు. నిజానికి కొత్త  ఆలయం నిర్మించడం కంటే, ఆ ప్రాంతంలో ఉన్న పురాతన వేంకటేశ్వర ఆలయాలను నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇది కాక మరొక ఆలయం క్రౌంచగిరి కొండ మీద ఉంది. మరొక రెండు ఆలయాలు వైకుంఠ గిరి, అనంతవనంలో ఉన్నాయి.

ఈ నిర్మాణం నిర్ణయం తీసుకున్నపుడే విమర్శలొచ్చాయి. భక్తుల డబ్బు ను ఇలాంటి భారీ ఆలయాల నిర్మాణం మీద ఖర్చు చేయడాన్ని చాలా మంది విమర్శించారు. టిటిడి ఇవొ అనిల్ కుమార్ సింఘల్ చంద్రబాబును సంతప్తి పరిచేందుకే ఇంత భారీ వ్యవయానికి అంగీకరించారని అంటున్నారు. ఇది అధికార దుర్వినియోగం,నిధుల మళ్లింపు అనే విమర్శ వస్తూ ఉంది. విదేశాలలో ఎవరైనా కడుతుంటే టిటిడి సహకరించవచ్చు. అయితే, ఆంధ్రలో, అందునా అమరావతికి ఆమడదూరంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం ఏమిటి? ఈ మధ్య తిరుమలలో రాజకీయ జోక్యం ఎక్కువయింది. ఇది టిటిడిలో రాజకీయ జోక్యమే అని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్ది ప్రశ్నిస్తున్నారు.

రాయలసీమలో ఉన్న తిరుపతి తిరుమల ప్రాశస్త్యం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నమనే విమర్శకూడా ఉంది.

బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి వంటి వారు #టిటిడి పరిపాలన ను రాష్ట్ర ప్రభుత్వం పరిధినుంచి తీసేయాలంటున్నది ఇలాంటి రాజకీయ జోక్యం వల్లే.

టిటిడి కార్యక్రమాల్లో ముఖ్యమయింది హిందూ ధర్మ ప్రచారం. దానికి గుళ్ల కంటే, టిటిడి స్కూళ్లు, టిటిడి ఆసుపత్రులు కట్టాలి. ఇండియాలో18,19 శతాబ్దాలలలో క్రిస్టియన్ మిషనరీలు ఆసుపత్రులు, పాఠశాలలోద్వారా క్రైస్తవాన్ని ప్రచారం చేశారు. టిటిడి రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే, భక్తుల్లో వ్యతిరేకత వస్తుంది.మన చుట్టు గుళ్లున్నాయి. పాఠశాలలు, వైద్యశాలలే లేవు. ఇలాంటి వాటివల్లే ధర్మ ప్రచారం బాగా సాగుతుంది.