ఆ కులాలనే నమ్ముకున్న చంద్రబాబు, జగన్

ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బిసి, కాపు కులాల సంపూర్ణ మద్దతో లేకపోతే మెజారిటీ మద్దతుతో చాలా అవసరం. అందులోను ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో పెద్ద పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి బిసిలను ఆకట్టుకునేందుకు వారి భజన మొదలుపెట్టారు. జనవరిలో రాజమండ్రిలో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జయహో బిసి సదస్సు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే పద్దతిలో వైఎస్సార్ సిపి కూడా బిసిల సదస్సు నిర్వహంచాలని నిర్ణయించింది. బిసి డిక్లరేషన్ ద్వారా బిసిలకు తాము చేయబోయేదేంటో స్పష్టం చేయాలని జగన్ ఉద్దేశ్యం. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే శెట్టి బలజలకు  ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా హామీ ఇచ్చారు.

 

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం పాదయాత్రలో ఉన్న జగన్ ను  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో వైసిపి నేతలు  కలిశారు.  ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ శెట్టి బలిజలకు కార్పొరేషన్ హామీ ఇచ్చారు. నిజానికి రాష్ట్రంలో బిసిల జనాభా ఎంత ? కాపుల శాతమెంత ? అనే విషయంలో స్పష్టత లేదు. బిసి, కాపుల సామాజికవర్గం నేతలే జనాభా విషయంలో ఒక్కొక్కరు ఒక్కో లేక్క చెబుతారు. అయితే, స్ధూలంగా బిసిల జనాభా శాతం సుమారు 35-40 దాకా ఉండవచ్చని అంచనా. అదే విధంగా కాపుల జనాభా శాతం కూడా 25 దాకా ఉండోచ్చని అనుకుంటున్నారు.

 

మొత్తం జనాభాలో మెజారిటీ శాతం ఉన్న బిసిల ప్రాబల్యం సుమారు 70 నియోజకవర్గాల్లో ఉండచ్చు.  అంటే ముస్లింలను కూడా బిసిల్లో కలిపేశారు కాబట్టి ప్రభావం బాగానే ఉంటుంది. అదే విధంగా కాపుల ప్రభావం కూడా 40 నియోజకవర్గాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో ఏ పార్టీ కూడా పై రెండు సామాజికవర్గాలను విస్మరించటం సాధ్యం కాదు. కాకపోతే పై రెండు కులాలే ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తుందనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే, మొదటి నుండి బిసిలు తెలుగుదేశంపార్టీకి గట్టి మద్దతుదారులుగా నిలుస్తున్నారు. అయితే, కాపులను బిసిల్లో చేరుస్తానన్న చంద్రబాబు హామీపై బిసిలు మండుతున్నారు. అదే విధంగా బిసిల్లో చేరుస్తానని కాపులకు హామీ ఇచ్చి తప్పటం వల్ల కాపుల్లో కూడా చంద్రబాబుపై అసంతృప్తి కనబడుతోంది. కాబట్టి ఈ రెండు సామాజికవర్గాలు టిడిపికి మద్దతుగా నిలబడే విషయం అనుమానమే.

 

అదే సమయంలో జగన్ కూడా పై రెండు సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు హామీలిస్తున్నారు. మరి జగన్ ను రెండు సామాజికవర్గాలు ఏ మేరకు నమ్ముతాయో చూడాలి. ఈ నేపధ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లోకి  దిగుతున్నారు. పవన్ మొదటి టార్గెట్ కాపులే అనటంలో సందేహమే లేదు. మరి మిగిలిన సామాజికవర్గాల మద్దతును పవన్ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి ? కాబట్టి పవన్ సంగతిని పక్కన పెట్టినా చంద్రబాబు, జగన్ మాత్రం బిసిల భజనలో పోటీ పడుతున్నట్లే అర్ధమైపోతోంది.