ప్రపంచం నూతన ప్రయోగాలకు వేదికగా మారుతుండగా, చైనా మరో విభిన్న ప్రయోగానికి సిద్ధమైంది. మనుషులకే కాకుండా రోబోలకూ మారథాన్ పోటీలను ఏర్పాటు చేయడం కొత్త ఆలోచనగా నిలిచింది. ఏప్రిల్‌లో బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లా ఈ ప్రత్యేక మారథాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో 12వేల మంది మానవ అథ్లెట్లతో పాటు డజన్ల కొద్దీ హ్యుమనాయిడ్ రోబోలు కూడా 21 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొంటాయి.
ఈ విభిన్న పోటీలలో ఎవరైతే అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తారు. రోబోల డిజైన్‌ను ప్రత్యేకంగా మానవ ఆకారానికి అనుగుణంగా రూపొందించడంతో పాటు 0.5 నుండి 2 మీటర్ల ఎత్తు, 0.45 మీటర్ల హిప్ టు ఫుట్ ఎక్స్ టెన్షన్ వంటి ప్రత్యేక నిబంధనలను పాటించారు. రిమోట్ కంట్రోల్ లేదా ఆటోమేటిక్ రోబోలు ఈ పోటీల్లో భాగం కావచ్చు.
చైనా కంపెనీలు తయారు చేసిన ఈ హ్యుమనాయిడ్ రోబోలు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవని వెల్లడించారు. గతంలో కూడా రోబోలు ప్రదర్శనాత్మక మారథాన్‌లలో పాల్గొన్నప్పటికీ, ఇలాంటి రియల్ రేసులో రావడం ఇదే మొదటిసారి. ఇందులో పాల్గొనే రోబోల పనితీరును మరింత మెరుగుపరచడానికి అవసరమైన బ్యాటరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
ఇలాంటి ప్రయోగాల వెనుక చైనాకు ఉన్న ఉద్దేశ్యం ఆసక్తికరంగా మారుతోంది. దేశంలో శ్రామికశక్తి తగ్గిపోవడంతో, అధిక వయస్కుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నంలో, రోబోలను శ్రామికశక్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రోబోల ప్రయోగం చైనాలో జాతీయ ప్రాధాన్యత పొందుతోంది.
ఈ ప్రయోగం విజయం సాధిస్తే, భవిష్యత్తులో రోబోలు అనేక రంగాలలో మనుషుల పనిని భర్తీ చేయగలవని అంచనా. ఇక ఈ ప్రత్యేక మారథాన్ పోటీతో చైనా నూతన టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయనుంది.