ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి చర్చ కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతల నుంచి నారా లోకేశ్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు బహిరంగంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్‌ను జనసేన నేతలు కూడా తీవ్రంగా పరిగణించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ ఆకాంక్షను వారు ఈ సందర్భంగా బలంగా వ్యక్తం చేశారు.
ఇటీవల టీడీపీలో ఈ అంశం కాస్త పతాక స్థాయికి చేరింది. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని కొందరు నేతలు చేస్తున్న డిమాండ్‌పై హైకమాండ్ దృష్టి సారించింది. ఆ వివాదాన్ని మరింత దూరం వెళ్లనివ్వకుండా తక్షణమే నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పార్టీ నేతలు డిప్యూటీ సీఎం అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని, మీడియా సమావేశాల్లోనూ ఈ విషయం ప్రస్తావించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఇక జనసేన కూడా ఈ అంశంపై అలెర్ట్ అయ్యింది. వెంటనే ఎండ్ కార్డ్ పెట్టేలా స్పందించింది. డిప్యూటీ సీఎం విషయంపై జనసేన కార్యకర్తలు, నేతలు బహిరంగంగా స్పందించకూడదని ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సందేశం పంపింది. ఇది టీడీపీ-జనసేన కూటమి మధ్య ఉన్న సంబంధాన్ని పటిష్టంగా ఉంచేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.
ఈ వ్యవహారం ఇప్పటికైనా ముగియుతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. జనసేన, టీడీపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలకు పగ్గం వేసినా, ఈ అంశం ఇప్పటికీ ఏపీ రాజకీయ చర్చలలో నిలిచి ఉంది. కూటమి మధ్య ఉన్న ఆంతర్యాన్ని చెరపకుండా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

