అదిగదిగో విశాఖ రాజధాని.! ఎన్నాళ్ళీ పాచిపోయిన పాఠం.!

సాధారణ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకీ.. మంత్రుల మాటలకీ చాలా తేడా వుంటుంది. మంత్రులు మాట్లాడితే, దాన్ని శాషనంగానే భావించేవారు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మంత్రుల మాటలూ పిట్టలదొరల కబుర్లలానే తయారైంది.

అప్పుడెప్పుడో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘అతి త్వరలో కర్నూలు న్యాయ రాజధాని అవుతుంది’ అని సెలవిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం వ్యవహారం ముందుకు కదల్లేదు. ఇప్పుడేమో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెండు నెలల్లోనే విశాఖ రాజధాని అవుతుందని  అంటున్నారు.

మరీ, పిట్టల దొర కబుర్లు పదే పదే వైసీపీ నేతలు ఎందుకు చెబుతున్నట్లు.? రెండు నెలల్లో విశాఖ రాజధాని అవ్వాలంటే, ఈపాటికి న్యాయపరమైన వివాదాలన్నీ పరిష్కారమైపోయి వుండాలి. హైకోర్టులో ఊరట దొరకలేదు. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయ్యింది. అవన్నీ తర్వాత, ముందైతే శాసన సభలో మూడు రాజధానులపై చట్టాన్ని చేయాల్సి వుంది కదా.? ఆ తర్వాత మళ్ళీ న్యాయ పరమైన వివాదాల వంటివి వస్తాయ్.

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలున్నాయో తెలుసా.?’ అని ఇదే గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు ఇటీవల. కానీ, మంత్రిగారికి రాష్ట్ర రాజధాని ఏదో తెలుసా.? అని జనం సెటైర్లేస్తున్నారు. మంత్రుల అత్యుత్సాహం కారణంగా, సంక్షేమ ప్రభుత్వంపై ప్రజల్లో నానాటికీ చులకనభావం ఏర్పడుతోంది.

ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి తెచ్చిన నాలుగైదు ఐటీ పరిశ్రమల గురించి గుడివాడ అమర్నాథ్ చెప్పలేరుగానీ, విశాఖను రాజధాని చేస్తారట.. అని జనం మండిపడుతున్న పరిస్థితి.