విశాఖపట్నం మైదానం మరోసారి బ్యాటర్లు రెచ్చిపోయారు. ఫ్లాట్ పిచ్, చిన్న బౌండరీలు, వేగమైన అవుట్‌ఫీల్డ్ కలిసి మ్యాచ్‌ను పరుగుల పండుగగా మార్చాయి. అయితే ఈ పరుగుల వర్షంలో పై చేయి సాధించింది మాత్రం న్యూజిలాండ్ జట్టే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఛేదనలో భారత్ కీలక సమయంలో కుప్పకూలి ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే మెరుపు ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లకు ఎలాంటి ఊరటనివ్వకుండా సీఫెర్ట్ ఆరంభం నుంచే దూకుడు చూపించాడు. కేవలం 25 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసిన అతడు, స్టేడియాన్ని ఉలిక్కిపడేలా షాట్లు ఆడాడు. మరోవైపు కాన్వే కాస్త నెమ్మదిగా ఆడుతూ భాగస్వామ్యాన్ని నిలబెట్టాడు.
మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయినా, చివర్లో డారిల్ మిచెల్ బ్యాట్ నుంచి వచ్చిన మెరుపులు న్యూజిలాండ్ స్కోరును ఊహించని స్థాయికి తీసుకెళ్లాయి. 18 బంతుల్లోనే 39 పరుగులు చేసిన మిచెల్, డెత్ ఓవర్లలో భారత్‌కు తీవ్ర నష్టం చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసి కాస్త ప్రతిఘటన చూపించారు.
216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. టాప్ ఆర్డర్ వరుసగా పెవిలియన్ చేరడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా ముందుకు సాగింది. మ్యాచ్ కివీస్ చేతుల్లోకి వెళ్లిందనుకున్న సమయంలో ఆరో స్థానంలో వచ్చిన శివమ్ దూబే ఒక్కసారిగా ఆశల్ని రేకెత్తించాడు. దూబే బ్యాట్ పట్టగానే మ్యాచ్ ముఖచిత్రమే మారిపోయింది. కేవలం 18 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసిన అతడు, భారీ షాట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఒక్కసారిగా భారత్ విజయం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించింది. కానీ దురదృష్టం భారత్‌ను వెంటాడింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో బ్యాట్‌కు తగిలిన బంతి స్టంప్స్‌ను తాకడంతో దూబే రన్ అవుట్‌గా వెనుదిరిగాడు.
దూబే అవుట్‌తోనే భారత ఇన్నింగ్స్‌లో గాలి పూర్తిగా తరిగిపోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయతో కీలక వికెట్లు తీసి భారత్ పతనాన్ని వేగవంతం చేశాడు. చివరికి జాకబ్ డఫ్ఫీ చివరి వికెట్‌ను కూల్చడంతో టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖలో పరుగుల వరదలో భారత్ ఆశలు మాత్రం అర్ధాంతరంగా మునిగిపోయాయి.
