బీరువా దిశ మారితే భాగ్యం మారుతుందా? వాస్తు ప్రకారం ధనం నిలిచే రహస్యాలు ఇవే..!

ఇంట్లో ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. అందుకే చాలామంది ఇంటి నిర్మాణం నుంచి రోజువారీ వస్తువుల అమరిక వరకూ వాస్తును పాటించేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా డబ్బు, విలువైన వస్తువులు భద్రపరిచే బీరువా విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుందనే నమ్మకం ఉంది. వాస్తు నిపుణుల మాటల్లో, బీరువా ఉంచే దిశ, దాని సంరక్షణ, అందులో ఉంచే వస్తువులు.. ఇవన్నీ కలిసి ఇంటి ఆర్థిక ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి.

వాస్తు ప్రకారం బీరువాను దక్షిణ, పడమర దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఈ దిశలో ఉంచినప్పుడు బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా చూసుకోవాలి. ఉత్తరం కుబేరుడి స్థానం కావడంతో, ఇలా చేస్తే ఇంట్లో సంపద నిలకడగా ఉంటుందని విశ్వసిస్తారు. మరో ముఖ్యమైన విషయం.. బీరువాను నేరుగా నేలపై పెట్టకూడదు. చెక్క పీట లేదా స్టాండ్‌పై ఉంచితే స్థిరత్వం పెరుగుతుందని వాస్తు సూచిస్తుంది.

చాలామంది అందంగా కనిపిస్తాయనే కారణంతో పెద్ద అద్దాలు ఉన్న బీరువాలను ఎంచుకుంటారు. కానీ వాస్తు పరంగా ఇవి అంత శుభకరం కాదని చెబుతారు. అద్దాల్లో డబ్బు ప్రతిబింబించటం వల్ల ఆర్థికంగా నష్టం కలుగుతుందనే నమ్మకం ఉంది. అలాగే, బీరువాలో పూర్తిగా డబ్బు లేకుండా ఉంచడం కూడా మంచిది కాదు. కనీసం కొన్ని నాణేలు లేదా విలువైన వస్తువులు ఉండేలా చూసుకోవాలి.

బీరువా పైన పాత సామాన్లు, పనికిరాని వస్తువులు పోగేయడం చాలామందిలో కనిపించే అలవాటు. దుమ్ము పేరుకుపోయినా పట్టించుకోరు. కానీ ఇవన్నీ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని వాస్తు చెబుతోంది. ముఖ్యంగా ఈశాన్య మూలలో బీరువాను ఉంచడం తీవ్ర ధననష్టానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, బీరువాను గోడకు పూర్తిగా ఆనించి పెట్టడం కూడా ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటుందని భావిస్తారు.

సానుకూల ఫలితాల కోసం బీరువా లోపల వెండి నాణేలు, లక్ష్మీదేవి పటం ఉంచడం మంచిదని వాస్తు సూచన. డబ్బు తీసే సమయంలో, పెట్టే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఒక ముఖ్యమైన అంశమే. చిరిగిన నోట్లు, చిత్తు కాగితాలు బీరువాలో ఉండకూడదు. తరచూ బీరువాను శుభ్రపరచి, ధూపం చూపించడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. చిన్నచిన్న జాగ్రత్తలే పెద్ద మార్పుకు దారి తీస్తాయనేది వాస్తు సారాంశం. బీరువా విషయంలో కనీస శ్రద్ధ పెట్టితే ఆర్థిక ఇబ్బందులు దూరమై, ఇంట్లో శుభం నిలుస్తుందని విశ్వాసం.