చిటికెడు ఆవాలు.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. రోజూ వంటలో ఉంటే శరీరంలో అద్భుత మార్పులివే..!

మన వంటింట్లో తరచూ కనిపించే చిన్న గింజలే అయినా, ఆరోగ్య పరంగా ఆవాల విలువ మాత్రం చాలా పెద్దది. తరతరాలుగా మన సంప్రదాయ వైద్యంలో ఆవాలను ఔషధంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. కూరల్లో, పచ్చళ్లలో, నూనెల రూపంలో వాడే ఆవాలు… శరీరానికి తెలియకుండానే ఎన్నో రకాల రక్షణ కవచంలా పనిచేస్తాయి. రోజువారీ ఆహారంలో ఆవాలు ఉంటే జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకూ అనేక లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆవాలలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కణాలను రక్షిస్తాయి. అంతేకాదు, విటమిన్ ఏ, సీ, కేతో పాటు బీ కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ ఉండటం వల్ల ఎముకలు, రక్తహీనత, కండరాల పనితీరుకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.

ఆవాలు మెటబాలిజాన్ని వేగవంతం చేసే లక్షణం కలిగి ఉంటాయి. శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ పెరగడంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. అందుకే బరువు నియంత్రణ కోరుకునే వారికి ఆవాలు మంచి సహాయకారి. రోజూ పరిమిత మోతాదులో తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియకు సహజంగా తోడ్పడతాయి. జీర్ణ ఆరోగ్యానికి ఆవాలు ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే ఫైబర్ పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలంగా బాధించే మలబద్ధక సమస్యకు ఇది మంచి సహజ పరిష్కారం. కడుపు భారంగా ఉండే భావన తగ్గి, జీర్ణక్రియ చురుగ్గా సాగుతుంది. అందుకే మన పెద్దలు భోజనంలో ఆవాల వినియోగాన్ని ప్రోత్సహించేవారు.

ఆవాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని రకాల ఆర్థరైటిస్ నొప్పులను కూడా తగ్గించే సామర్థ్యం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చిన్న గింజలే అయినా, రోజూ వంటలో ఆవాలు ఉంటే శరీరం లోపల నుంచి బలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.