Pawan Kalyan: రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ మానవత్వానికి, విలువలకే తన ప్రాధాన్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. తన తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల (జూ పార్క్)లో రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
సాధారణంగా ప్రముఖులు తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజున వేడుకలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం వినూత్నంగా ఆలోచించి, మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. దత్తత తీసుకున్న ఆ రెండు జిరాఫీల సంపూర్ణ సంరక్షణ, వైద్యం మరియు ఆహార ఖర్చులను ఏడాది పాటు తన వ్యక్తిగత నిధుల నుంచే భరించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రకృతిని, మూగజీవాలను ప్రేమించడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛందంగా వ్యక్తులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖ జూ సందర్శనలో పవన్ కళ్యాణ్ ఒక సామాన్య జంతు ప్రేమికుడిలా గడిపారు. జూలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏనుగులు, జిరాఫీల వద్దకు వెళ్లి వాటికి స్వయంగా ఆహారాన్ని అందించారు. జూ నిబంధనలను పాటిస్తూనే, సింహాలు, పులులు, నీటి ఏనుగుల ఆరోగ్యం మరియు వాటికి అందించే పోషకాహారం గురించి క్యూరేటర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జూ సందర్శన ముగించుకున్నాక, పవన్ కళ్యాణ్ కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ‘నగర వనాన్ని’ ప్రారంభించారు. అటవీ శాఖ అధికారులతో కలిసి ‘కనోపీ వాక్’ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షించారు. అటవీ జీవవైవిధ్యం, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అధికారులతో చర్చించారు. అటవీ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పర్యటనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు మరియు వన్యప్రాణి సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

