కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు నిద్రపోతాయో తెలుసా.. అసలు కారణం ఇదే..!

ఇంట్లో కుక్క ఉన్నవారు తరచూ గమనించే దృశ్యం ఇది. వాటికి ఎంత సౌకర్యవంతమైన మంచం పెట్టినా, సోఫా లేదా ప్రత్యేకంగా కొనిచ్చిన చిన్న హౌస్ ఉన్నా కూడా చాలా కుక్కలు వాటిని పక్కనపెట్టి తలుపు దగ్గరే పడుకుంటాయి. మొదట ఇది వింతగా అనిపించినా, నిపుణులు చెప్పే కారణాలు వింటే ఆశ్చర్యం మాయమవుతుంది. ఇది మొండితనం కాదు, అలసత్వమూ కాదు.. కుక్కల సహజ స్వభావానికి చెందిన ప్రవర్తన.

కుక్కలు మొదట అడవుల్లో జీవించిన జంతువులు. అప్పట్లో గుహలు, తెరిచి ఉన్న ప్రదేశాలే వాటి ఆశ్రయాలు. అలాంటి చోట్ల ప్రవేశ ద్వారం అత్యంత కీలకం. అక్కడే ఉండటం వల్ల బయట నుంచి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించగలిగేవి. గుంపును రక్షించుకోవడానికి ఇదే సరైన స్థానం. అదే స్వభావం ఈరోజు పెంపుడు కుక్కల్లోనూ కొనసాగుతోంది. ఇంటిని తమ భూభాగంగా భావించే కుక్కలు తలుపు దగ్గర ఉండటాన్ని ఒక బాధ్యతలా తీసుకుంటాయి.

తలుపు దగ్గర పడుకోవడం వల్ల బయట శబ్దాలు, అడుగుజాడలు, కదలికలను వెంటనే గమనించగలుగుతాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్నది తెలుసుకోవడం వాటికి భద్రతా భావాన్ని ఇస్తుంది. ఇది నా ఇల్లు, నేను కాపలా చూస్తున్నాను అనే భావనకు ఇది స్పష్టమైన సంకేతం. అంతేకాదు, ఇంట్లో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించగలగడం కుక్కలకు మానసిక సంతృప్తినీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కుక్కల నిద్ర మనుషుల్లా లోతుగా, నిరంతరంగా ఉండదు. అవి లోతైన నిద్ర, తేలికపాటి నిద్ర మధ్య మారుతూ ఉంటాయి. అందుకే తలుపు దగ్గర పడుకుంటే అవి విశ్రాంతి తీసుకుంటూనే అప్రమత్తంగా ఉండగలుగుతాయి. అదే సమయంలో ఇంట్లోని మనుషులతో సంబంధం కూడా కోల్పోవు. చాలా సందర్భాల్లో ఇది ఆరోగ్యకరమైన, సాధారణ అలవాటే.

అయితే కొన్ని వేళల్లో ఇదే అలవాటు ఆందోళనకు సంకేతంగా కూడా ఉండొచ్చు. కుక్క తరచూ లేచి కూర్చోవడం, శాంతిగా నిద్రపోకపోవడం, చిన్న శబ్దానికే ఉలికిపడటం కనిపిస్తే అది ఒత్తిడిలో ఉన్నట్లు అర్థం. అలాంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉండే చోట సౌకర్యవంతమైన మంచం ఏర్పాటు చేయాలి. ఇష్టమైన బొమ్మలు, పరిచయమైన వాసన ఉన్న వస్తువులు ఉంచితే కుక్క త్వరగా అలవాటు పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతం చేయకూడదు లేదా శిక్షించకూడదని పశువైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి, కుక్కలు తలుపు దగ్గర పడుకోవడం వాటి సహజత్వం, భద్రతా భావం, మానసిక సౌకర్యానికి సంబంధించిన విషయం. దీనిని తప్పుగా అర్థం చేసుకోకుండా, కుక్క అవసరాలను గమనించి ప్రేమతో చూసుకుంటే అవి మరింత ప్రశాంతంగా, ఆనందంగా మనతో ఉంటాయి.