Nara Lokesh Birthday: మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల

Nara Lokesh Birthday: ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుండి ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు, రాజకీయ పరిణామాలకు దూరంగా ఉంటున్న నందమూరి వారసుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్‌కు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. “నారా లోకేష్ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను” అని తారక్ ట్వీట్ చేశారు.

నారా-నందమూరి కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ రెండు కుటుంబాల అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వీరిద్దరూ కలిస్తే తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో లోకేష్ తీసుకువస్తున్న మార్పులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భావి తరాల కోసం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపన, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. “లోకేష్‌కు భగవంతుడు మరింత శక్తిని, ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్థిస్తున్నాను” అని పవన్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నప్పటికీ, వ్యక్తిగత స్థాయిలో శుభాకాంక్షలు తెలపడం విశేషం.

2024 ఎన్నికలకు ముందు ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన లోకేష్, మంగళగిరి నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం మంత్రిగా ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖలను నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు.

మగాళ్ల బతుకు బజారు || Kerala Bus Video Deepak Issue EXPOSED By Dasari Vignan || Telugu Rajyam