అన్ని కాలాల్లో, అతి తక్కువ ధరలో, ఎక్కడైనా సులభంగా దొరికే పండు అరటిపండు. అయినా చాలా మంది దీన్ని సాధారణ పండుగా భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ పోషక నిపుణుల మాటల్లో, అరటిపండు ఒక సంపూర్ణ ఆరోగ్య ప్యాకేజ్. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇది తల్లి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, గర్భంలో పెరుగుతున్న శిశువు అభివృద్ధికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకుంటే శరీరంలో కనిపించే మార్పులు ఆశ్చర్యపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య నీరసం, అలసట. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. అదే సమయంలో ఇందులోని ఫోలిక్ యాసిడ్, బీ విటమిన్లు శిశువు మెదడు, వెన్నెముక సరైన అభివృద్ధికి తోడ్పడతాయి. గర్భిణీలకు తరచూ వచ్చే మలబద్ధకం సమస్యను ఇందులోని ఫైబర్ సహజంగానే తగ్గిస్తుంది. కడుపు సాఫీగా పనిచేయడంతో గర్భధారణ కాలం మరింత సౌకర్యంగా మారుతుంది.
అరటిపండు మానసిక ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే మూలకం ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తుంది. హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే చిరాకు, ఆందోళన తగ్గడంలో ఇది సహాయకారిగా పనిచేస్తుంది. అలాగే, అరటిపండులో ఉండే ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుంచి రక్షణ ఇస్తుంది. ఇది గర్భిణీలకు అత్యంత అవసరమైన అంశమే.
రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా అరటిపండు ముందుంటుంది. విటమిన్ బి6, విటమిన్ సి శరీరాన్ని బలంగా ఉంచి జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజ మెరుపునిచ్చి, జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడతాయి. అందుకే గర్భధారణ సమయంలో అరటిపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ప్రతి ఆహారం లాగానే అరటిపండును కూడా పరిమితంగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తీసుకునే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో తీసుకుంటే అరటిపండు తల్లి–బిడ్డ ఆరోగ్యానికి నిజంగా వరంలా మారుతుంది.
