టిఆర్ఎస్ పై టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

టిఆర్ఎస్ పై అశ్వారావు పేట టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెచ్చా నాగేశ్వరరావు కూటమి అభ్యర్దిగా టిడిపి నుంచి గెలుపొందారు. అయితే తనకు టిఆర్ఎస్ పార్టీలో చేరమని భారీ ఆఫర్లు వచ్చాయని కానీ నేను టిఆర్ఎస్ లోకి వెళ్లదలుచుకోలేదన్నారు. అశ్వారావు పేటలో నాగేశ్వరరావు ఏం మాట్లాడారంటే…

“నేను టిడిపి అభ్యర్థిగా కూటమి పార్టీల మద్దతుతో గెలుపొందాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టిఆర్ఎస్ లోకి రమ్మని భారీ ఆఫర్లు వచ్చాయి. నగదు మరియు స్థిర ఆస్తుల రూపంలో నాకు ఆఫర్లు ప్రకటించారు. భవిష్యత్తులో మంచి పదవులు కూడా ఇస్తామని టిఆర్ఎస్ కీలక నేతలు నాతో సంప్రదింపులు జరిపారు. కానీ నేను వారకి ముక్తకంఠంతో ఒక్కటే చెప్పాను. నేను టిఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని మరొక సారి నన్ను సంప్రదించవద్దని తెలిపాను.

నాకు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వరరావు పిలిస్తేనే నేను టిఆర్ఎస్ లోకి వెళ్లలేదు. ఇప్పుడెలా వెళ్తాను. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి టిడిపిలో నే ఉన్నాను. పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తారా? లేకపోతే చేయరా? ప్రజలకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లైనా న్యాయం జరిగేలా చూస్తాను. ప్రతిపక్షాలు లేకుండా పోతే అది ప్రజాస్వామ్యం కాదు.  ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా పార్టీ మారేది లేదు.

ఖమ్మంలో ప్రజల తీర్పు చూస్తేనే అర్దమైతుంది ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. ప్రజలు ఇచ్చిన తీర్పుకు నేను కట్టుబడి ఉంటాను. పదవులు, డబ్బులకు ఆశపడితే నన్ను నమ్ముకున్న లక్షలాది కుటుంబాలను నేను మోసం చేసినట్టే లెక్క. కొంతమంది కావాలని కార్యకర్తలను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నా పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను కారెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. వాటిని ఎవరూ నమ్మవద్దు. 

మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావు పేట ఎమ్మెల్యే

నా పై నమ్మకంతో గెలిపించిన ప్రజలందరి కోరిక మేరకు నేను నడుచుకుంటాను. టిడిపి పార్టీ నాకు జీవితాన్నిచ్చింది. తాను ఎట్టి పరిస్థితిలో టిడిపిని వీడేది లేదు. టిఆర్ ఎస్ నేతలు నా పై ఒత్తిడి తీసుకొచ్చారు. నేను రానని ఖరాకండిగా చెప్పడంతో అదిరించో బెదిరించో లొంగదీసుకోవాలనుకున్నారు. కానీ నా పై ఒక్క మచ్చ కూడా లేకపోవడంతో చేసేదేం లేక ఇక వారు వెనుదిరిగారు.

నన్ను మంచి నాయకుడిని చేస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. నేను టిడిపి తరపున పోటి చేసినా కూటమి పార్టీల వారు అంతా కలిసి ఓట్లేసి గెలిపాంచారు. నేను వారందరికి రుణ పడి ఉంటాను. అందరి అవసరాల కోసం నేను పని చేస్తాను.” అని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.

టిఆర్ఎస్ పై నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యేలను కొనేందుకు టిఆర్ ఎస్ పార్టీ లోలోపల ఇంత ప్రాసెస్ చేస్తుందా అని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. కీలక నేతలు సంప్రదించారనడంతో ఎవరా కీలక నేతలు అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఏదేమైనా మెచ్చా వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు.