వైసిపిలోకి దాసరి..బెజవాడ ఎంపి టికెట్ ?

తెలుగుదేశంపార్టీ నుండి వైసిపి లోకి వలసలు ఊపందుకున్నాయి. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో పట్టున్న టిడిపి నేత దాసరి జై రమేష్ త్వరలో వైసిపిలో చేరటానికి రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డితో దాసరి భేటీ అవనున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి తరపున విజయవాడ ఎంపిగా దాసరి పోటీ చేయబోతున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసిపికి కమ్మ సామాజికవర్గం నేతలు పెద్దగా మద్దతుగా నిలబడలేదు.

కృష్ణా జిల్లాలో వసంత కృష్ణప్రసాద్,  యలమంచిలి రవి లాంటి ఇద్దరు ముగ్గురు తప్ప గట్టి కమ్మోరు మద్దతుగా లేరు. గుంటూరు జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే దాసరి జై రమేష్ వైసిపిలో చేరటమంటే పార్టీకి బూస్టప్ ఇచ్చినట్లే అనుకోవాలి.  మొన్నటి వరకూ వైసిపిలో కీలకంగా పనిచేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టిడిపిలో చేరటంతో ఆ వెలితి కొంత కనబడింది. దాన్ని దాసరితో భర్తీ చేసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లుంది.

అందుకనే విజయవాడ ఎంపిగా టికెట్ విషయంలో జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. దాసరికి విజయవాడతో పాటు పెనమలూరు, మైలవరం తదితర నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులు, బంధుగణం ఉంది. కాబట్టే జగన్ కూడా దాసరికి ఎంపి టికెట్ కేటాయించటంలో పెద్దగా ఆలోచించలేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ టిడిపి నుండి వైసిపిలోకి వలసలు మొదలవ్వటంతో చంద్రబాబు అండ్ కో తట్టుకోలేకున్నారు. దాంతో ఆ అక్కసునంతా జగన్ మీద చూప ఆనందపడుతున్నారు.