భారత రాజకీయాలపై సుష్మా స్వరాజ్ ముద్ర

భారత రాజకీయాలపై సుష్మా స్వరాజ్ ముద్ర

కాశ్మీర్ సమస్య పరిష్కరించామని, కాశ్మీర్ ను దేశంలో అంతర్భాగం చేశామని బిజెపి శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్న వేళ సుష్మ స్వరాజ్ మరణ వార్త అందరినీ తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది . అంచెలంచెలుగా ఎదుగుతూ ఒదిగి వున్న గొప్ప నాయకురాలు , జాతీయ భావాలు అణువణులో నింపుకున్న రాజకీయ నాయకురాలు . సుష్మ మరణించడానికి ముందు ఆర్టికల్ 370 రద్దు అయినట్టు తెలుసుకుని … “ఇంతకాలం ఇలాంటి వార్త కోసమే ఎదురు చూస్తున్నా … మోడీజీ ” అంటూ ట్విట్ చేసింది అంటే అంత అనారోగ్యంలో కూడా ఒక జాతీయ వాదిగా స్పందించిన తీరు అభినందనీయం .

సుష్మా స్వరాజ్ భౌతిక కాయాన్ని చూసిన భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎల్ .కె .అద్వానీ కన్నీరు ఆపుకోలేకపోయారు . సుష్మ తో అద్వానీజీ ప్రత్యేకమైన అనుబంధం . సుష్మ అద్వానీజీ ని గురువుగా భావిస్తుంది . ఆమె ప్రతి ఎదుగుదలలోను అద్వానీజీ ప్రోత్సాహం వుంది . ఆమెతో గత మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు . తన ప్రతి పుట్టిన రోజు నాడు తన కిష్టమైన చాకోలెట్ కేక్ తీసుక వచ్చేది  ఆ విషయంలో ఆమె ఎప్పుడు కేక్ మర్చిపోవడం అన్నది జరగలేదు .. అంటూ కన్నీరు పెట్టుకున్నారు .
14 ఫిబ్రవరి 1952న హర్యానాలో హర్ దేవ్ శర్మ , లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు . తండ్రి రాష్ట్రీయ స్వయం సేవక్ లో సభ్యుడు . అందుకే ఆమెపై ఆ ప్రభావం పడింది . నిజానికి సుష్మ తల్లితండ్రులు ది పాకిస్తాన్ లోని లాహోర్ . విభజన సమయంలో భారత దేశానికి వచ్చారు . సుష్మ డిగ్రీ తరువాత పంజాబ్ యూనివర్సిటీ లో లా చదివారు . 1973లో సుప్రీమ్ కోర్టు లో ప్రాక్టీస్ ప్రారంభించారు . 1975లో తన లా సహచరుడు స్వరాజ్ కౌశల్ ను వివాహం చేసుకున్నారు . 1977లో మొదటిసారి హర్యానాలో అంబాలా నియోజకవర్గం నుంచి శాసన సభ నుంచి ఎన్నికయ్యారు . అదే సంవత్సరం దేవీలాల్ మంత్రివర్గంలో సుష్మకు చోటు లభించింది . అప్పటికే ఆమె వయసు 25 సంవత్సరాలే . ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా , కేంద్ర మంత్రిగా , పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకురాలిగా , ఢిల్లీ ముఖ్యమంత్రిగా , విదేశాంగ శాఖ మంత్రిగా ఎన్నో పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు . ఇందిరాగాంధీ తరువాత విదేశాంగ శాఖను చేపట్టింది సుష్మనే . ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా సుష్మా స్వరాజ్ . అనుక్షణం దేశ సేవలో శ్రమించిన ఉత్తమోత్తమ రాజకీయ నాయకురాలు సుష్మ .