అసలు అప్పులు చేయని రాష్ట్రం దేశంలో వుందా.? అప్పులు చెయ్యని దేశం ఈ ప్రపంచంలో వుందా.? అంటూ ఆసక్తికరమైన ప్రశ్నాస్త్రాన్ని సంధించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్రం అప్పులపాలైపోతోందంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శల నేపథ్యంలో.
ప్రజల్ని కాపాడేందుకు, పరిపాలన సజావుగా సాగేందుకూ రాష్ట్రం అప్పులు చేయక తప్పడంలేదన్నది బుగ్గనగారి ఉవాచ. నిజమే, కరోనా నేపథ్యంలో ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలూ అప్పుల కోసం ఎగబడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చాలా భిన్నం. విభజన గాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పట్లో మానేలా లేవు. దానికి అదనంగా కొత్త గాయాలవుతున్నాయి.
చంద్రబాబు హయాంలో అప్పుల కుంపటి అనూహ్యంగా పెరిగింది. అంతకు మించి ఇప్పుడు అప్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేసినా, అది ప్రజల్ని ఉద్ధరించడానికేనని చెప్పడం సహజమే. మంత్రి బుగ్గన నుంచి ఇంతకంటే భిన్నమైన సమాధానం ఎలా వస్తుంది.? కానీ, ఈ అప్పుల్ని తీర్చేది ఎవరు.? ప్రజలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నెత్తిన వున్న అప్పుని తీర్చేంత సమర్థత కలిగి వున్నారా.? అన్నదే అసలు ప్రశ్న. బాదేద్దాం పన్నులు.. అన్న చందాన, ఎలా వీలైతే అలా ప్రభుత్వాలు ప్రజల్ని బాదేయడం తప్ప, వేరే మార్గం లేదు.
ఇవన్నీ ముందు ముందు అత్యంత ఖరీదైన తప్పిదాలు కాబోతున్నాయి. అదే అసలు సమస్య. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విపక్షాల మీద ఎదురుదాడి చేయడం అనేది రాజకీయ కోణంలో సబబే. కానీ, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పగలుగుతుంది.? అన్నదే కీలకమైన అంశమిక్కడ. కేంద్రం నుంచి రప్పించాల్సిన నిధుల్ని రప్పించలేక, రాష్ట్రం అదనంగా అప్పులు చూసుకుంటూ పోతే, చివరికి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.