సాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి రాజకీయానికి చావో రేవో.!

రాజకీయాల్లో కురువృద్ధడు.. అనదగ్గ స్థాయి వ్యక్తుల్లో ఆయనా ఒకరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా గతంలో ఆయనకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ‘ముఖ్యమంత్రి పదవి నాకు చాలా చిన్నది..’ అని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం చూశాం. కానీ, విధిలేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది జానారెడ్డికి. ఉప ఎన్నిక ప్రచారం చాలా జోరుగా సాగింది, సాగుతోంది కూడా. నేటితో ప్రచారానికి శుభం కార్డు పడనుంది.

నిజానికి, జానారెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకీ ప్రత్యేకమైన అభిమానం వుంది. కానీ, రాజకీయం రాజకీయమే కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. గెలుపు అంత తేలిక కాదన్న ఫీడ్ బ్యాక్ అందడంతోనే నోముల నర్సింహయ్య కుమారుడు నోములు భగత్ తెరమీదకు వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా. సీనియర్ రాజకీయ నాయకుడా.. నవ యువకుడా.? అన్నది తేలిపోవాలన్నది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో బాగా వాడిన ప్రస్తావన. సీనియర్ నాయకుడు కాదు.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే వయసొచ్చింది గనుక, జానారెడ్డిని పక్కన పెట్టమని ఓటర్లకు సూచించింది టీఆర్ఎస్. అయితే, గులాబీ పార్టీ అంచనాలకు మించి జానారెడ్డి ఊపు కనిపిస్తోంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. దాంతో నిన్నటి బహిరంగ సభ విషయంలో కేసీఆర్ కూడా మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. ఏం చేసినాసరే, సాగర్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి గెలుపు అంత తేలిక కాదు. అన్నట్టు, బీజేపీ కూడా కొంత హడావిడి చేసినా, క్రమంగా బీజేపీ ప్రాబల్యం తగ్గిపోతూ వచ్చింది. గెలిస్తే జానారెడ్డి ఇంకొన్నేళ్ళు తెలంగాణ రాజకీయ తెరపై కన్పిస్తారు. ఓడితే మాత్రం, రాజకీయ సన్యాసమే.. వేరే దారిలేదిక.