సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇక ఎంతో సమయం లేదు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పాత కాపుల్లో ఒకింత కలవరానికి గురి చేస్తోంది. ప్రత్యేకించి- ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి, విభజన తరువాత కనుమరుగైన నాయకులు ఒక్కరొక్కరుగా బయటికి వస్తున్నారు. ఏదో ఒక పార్టీలో చేరిపోవడానికి దారులు వెదుక్కుంటున్నారు. 2014 ఎన్నికల తరువాత మరణావస్థకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉండలేక, ఏ పార్టీలోనూ చేరలేక క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇప్పుడు మళ్లీ వారికి సమయం వచ్చింది. తమకు ఏ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంటుందో బేరీజు వేసుకుంటున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అలాంటి నాయకులు ఉన్నారు. డీఎల్ రవీంద్రా రెడ్డి, అహ్మదుల్లా (కడప), కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (కర్నూలు), శైలజానాథ్ (అనంతపురం), కొణతల రామకృష్ణ (విశాఖపట్నం).. ఇలా వారంతా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను వెదుక్కునే పనిలో పడ్డారు. మొన్నటిదాకా సబ్బం హరి కూడా ఇదే జాబితాలో ఉన్నప్పటికీ, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది.
మాజీ మంత్రి, కడప మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా కూడా తెలుగుదేశంలో చేరే అవకాశాలు లేకపోలేదు. ఇదివరకే ఆయన ఓ దఫా చంద్రబాబుతో సంప్రదింపులు నిర్వహించారు. మరో మాజీ మంత్రి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి పరిస్థితి డోలాయమానంలో ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నద్ధులయ్యారనే టాక్ ఉంది. విజయమ్మ ఆయన చేరికను గట్టిగా వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆస్తుల కేసులో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేయడానికి కారణమైన నాయకుల్లో డీఎల్ ఒకరు. అందుకే ఆయన చేరికను విజయమ్మ ఇష్టపడలేదు. అంతేకాదు- విశాఖపట్నం లోక్‌సభ స్థానంఓల విజయమ్మ ఓడిపోయిన తరువాత డీఎల్ ఘాటు వ్యాఖ్యానాలు చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించి చూస్తే.. డీఎల్‌కు వైఎస్ఆర్ సీపీలో ఇప్పుడు కూడా స్థానం దొరకనట్టుగానే భావించాలి.
అలాగని- ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి స్వతహాగా ఇష్ట పడట్లేదు. దీనికి కారణం- చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రధాన అడ్డంకి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు డీఎల్ రవీంద్రా రెడ్డికి వైరం ఉంది. పార్టీ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా ఇద్దరి మధ్యా సఖ్యత లేదు. డీఎల్ రాకను సీఎం రమేష్ వ్యతిరేకిస్తారనడంలో సందేహాలు అనవసరం.
పోనీ- `జమ్మలమడుగు ఫార్ములా` తరహాలో చంద్రబాబు ఇద్దరి మధ్యా రాజీ కుదుర్చుతారని అనుకోవడానికీ ఛాన్స్ లేదు. సీఎం రమేష్ ఒక్కసారి నో అంటే.. చంద్రబాబు కూడా ఏమీ చేయలేరు. ఈ పరిస్థితుల్లో డీఎల్ ముందు ఉన్నది ఒక్కటే మార్గం. కాంగ్రెస్‌లోనే కొనసాగడం. తెలుగుదేశం-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే డీఎల్ రాజకీయ భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. పొత్తులో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కేటాయించి, అక్కడి నుంచి డీఎల్‌ను బరిలో దింపడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.ప్రస్తుతం మైదుకూరు స్థానం వైఎస్ఆర్ సీపీ చేతిలో ఉంది.
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఆ ఏ పార్టీలో చేరతారనేది స్పష్టంగా తెలియరాలేదు. ఓ సారి వైఎస్ఆర్ సీపీ, మరోసారి తెలుగుదేశం.. ఇలా ఊగిసలాడుతున్నారాయన. కర్నూలు `ఫిరాయింపు` ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. కోట్లను టీడీపీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్లతో పాటు వైఎస్ఆర్ సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరవచ్చని కర్నూలు జిల్లాలో చర్చ నడుస్తోంది.
అనంతపురం జిల్లాలో మాజీమంత్రి శైలజానాథ్ కూడా టీడీపీ వైపే చూస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఆయన శింగనమల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలను కాదని, శైలజానాథ్‌కు టికెట్ ఇస్తారా? అనేది అనుమానమే. శింగనమల ఎస్సీ రిజర్వుడ్ స్థానం. అనంతపురంలో మరో ఎస్సీ రిజర్వుడ్ స్థానం ఉన్నది మడకశిర. మడకశిరలో శైలజానాథ్‌ను నిలబెడితారా? అనేది కూడా క్వశ్చన్ మార్కే.
ఉత్తరాంధ్రలో కొణతల రామకృష్ణ బలమైన నాయకుడు. వైఎస్ఆర్ సీపీ నుంచి బయటికి వచ్చిన తరువాత ఆయన కూడా క్రియాశీలకంగా లేరు. ఆయనను పార్టీలోకి తీసుకుని లోక్‌సభ స్థానంలో నిలబెట్టాలనేది టీడీపీ వ్యూహం. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవడంతో కొణతలకు విశాఖపట్నం లోక్‌సభ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు.
ఇదే స్థానం కోసం సబ్బంహరి నుంచి కొంత పోటీ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ- పాత కాపులు ఏదో ఒక పార్టీని వెదుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలితానిస్తాయనేది మరి కొద్దిరోజుల్లో తేటతెల్లం అవుతుంది. సంక్రాంతి తరువాత చేరికలకు ముహుర్తాలు ఖాయం అవుతాయి. జనసేన పార్టీలో చేరడానికి సీనియర్లు ఎవరూ పెద్దగా ఇష్ట పడట్లేదు.