కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

కర్నూల్ జిల్లా ఆలూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దహోతూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

కర్నూలు వన్ టౌన్ కు చెందిన వీరంతా చిన్నారి పుట్టి వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా పెద్దహోతూరు వద్ద వీరి వాహనం రిపేర్ కావడంతో పక్కకు ఆపారు. ఉదయం సమయంలో 4 గంటల సమయంలో వీరి వాహనాన్ని గుర్తించని గుర్తు తెలియని వాహనం ఆటోను ఢికొట్టింది.

ఆటోను ఢికొట్టిన తర్వాత వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. ఆటోను ఢికొట్టింది లారీగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కర్నూలు వన్‌టౌన్‌కు చెందినవారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.