కిందా మీదా పడ్తున్న రఘురామ కృష్ణరాజు.. చివరికి సాధించేదేంటి.?

Raghu-Rama-Krishna-Raju's-S

Raghu-Rama-Krishna-Raju's-S

నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రాణ హాని వుంది..’ అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారట. ప్రధానికీ ఫిర్యాదు చేస్తారట. వైఎస్ జగన్ బెయిల్ రద్దయితేనే తాను ఏపీలో అడుగు పెడతానని కొత్త.. వింత వాదనను తెరపైకి తెచ్చారు ఈ నర్సాపురం ఎంపీ. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే, సీబీఐ కోర్టు రఘురామ అభ్యర్థనను తిప్పి పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అనుకూల మీడియాతోపాటు, టీడీపీ అనుకూల మీడియాలోనూ ఈ మేరకు కథనాలొచ్చాయి. అయితే, రఘురామ మాత్రం, వింత వాదనను తెరపైకి తెచ్చారు. బెయిల్ వ్యవహారానికి సంబంధించి కాపీని శుక్రవారం సమర్పించబోతున్నామనీ, వచ్చేవారం ఈ విషయమై విచారణ ప్రారంభమవుతుందనీ సెలవిచ్చారు రఘురామ కృష్ణరాజు.

వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల కేసు వున్న మాట వాస్తవం. దీనికి సంబంధించి పలు చార్జి షీట్లు కూడా నమోదయ్యాయి. వైఎస్ జగన్ గతంలో ఈ కేసుకి సంబంధించి జైలుకు కూడా వెళ్ళారు. అనంతరం బెయిల్ మీద విడుదలయ్యారు. కోర్టు విచారణకు హాజరవుతూనే, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతల్ని నిర్వర్తించారు.. జనంలోకి వెళ్ళి, అధికారంలోకి వచ్చారు కూడా. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కేసు విచారణ కొనసాగుతూనే వుంది. ఏదో ఆషామాషీగా వ్యక్తిగత విచారణ నుంచి జగన్ మోహన్ రెడ్డికి న్యాయస్థానాలు వెసులుబాట్లు కల్పిస్తాయని ఎలా అనుకోగలం.? రఘురామ కృష్ణరాజుకి తన వాదనల్ని న్యాయస్థానంలో విన్పించే హక్కు వుంది. అంతమాత్రాన, అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఎలా.? పిలిచి ఎంపీ టిక్కెట్ ఇచ్చి, ఎంపీగా గెలిపించినందుకు.. రఘురామ కృష్ణరాజు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిన శాస్తే చేస్తున్నారని అనుకోవాలేమో.