ఏపీలో రాజధాని అమరావతి అభివృద్ధి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఓ ప్రైవేట్ కాంక్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. అమరావతిని హైదరాబాద్ తరహాలో మహానగరంగా తీర్చిదిద్దుతామని, క్వాంటం వ్యాలీ, జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నామని, జగన్ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు.
అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములేనని, హైదరాబాద్ లో హైటెక్ సిటీ రాకముందు ఎకరం లక్ష రూపాయలు ఉండేదని, ఇప్పుడు వంద కోట్లకు చేరిందని చంద్రబాబు గుర్తుచేశారు. పరిశ్రమలు, అభివృద్ధి వల్లే భూమి విలువ పెరుగుతుందన్నారు. అమరావతి రైతులకు ఏ మాత్రం అన్యాయం జరగదన్నారు. “అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే.. అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది” అని ఆయన అన్నారు. గుంటూరు-విజయవాడ-తెనాలి-గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు. భూములిచ్చిన వారిని ఆదుకుంటామని, అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామని, క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు కొన్ని ఇప్పటికే ఉన్నాయని, మరికొన్ని రాబోతున్నాయన్నారు. రాయలసీమలో నీటి సమస్యను పరిష్కరించి, అనంతపురం జిల్లాను కోస్తా జిల్లాల కంటే జీఎస్డీపీలో టాప్ స్థానానికి చేర్చగలిగామని గుర్తుచేసుకున్నారు. కేవలం వృధా జలాలను మాత్రమే వినియోగించుకుంటున్నామని చెప్పారు. “నీళ్లు లేకపోయినా పర్వాలేదు, రోడ్లు లేకపోయినా పర్వాలేదంటే మనం ఇక్కడే ఉంటాం” అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కూడా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటుందని, చిన్న చిన్న విషయాలతో ఆలోచనలు ఆపేస్తే అభివృద్ధి ఆగిపోతుందని వివరించారు.
ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో తాను తీసుకున్న నిర్ణయాల వల్ల రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారని చంద్రబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలు కట్టకుండా, కట్టేశామని జగన్ చెబుతున్నారని విమర్శించారు. తాము ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదని, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతినే నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. నిర్వహణ ప్రభుత్వానిదేనని, వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. “ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.


