హోరెత్తిపోనున్న ఎన్నికలు..అందరి లక్ష్యం ఒకటే

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రం హోరెత్తిపోనున్నది. ఎందుకంటే, అధికారం అందుకోవటమే లక్ష్యంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నాలుగు పార్టీలు తీవ్రంగా పోటీపడనున్నాయి కాబట్టి. అధికారం కోసం ఒక పార్టీ మరో పార్టీపై ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.  1982కు ముందు కాంగ్రెస్ ఒక్కటే ప్రధాన పార్టీ. అప్పుడప్పుడు వామపక్షాలు తళ్ళుక్కున మెరిసి మాయమైపోయేవి. ఎప్పుడైతే 1982లో ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని స్ధాపించారో కాంగ్రెస్ అప్రతిహత అధికారానికి గండిపడింది. ప్రతీ ఎన్నికలోనూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ టిడిపితో పోటీ పడుతోంది. ఒకసారి టిడిపి అధికారంలో ఉంటే మరో ఎన్నికలో కాంగ్రెస్  అధికారాన్ని దక్కించుకునేంది.

 

టిడిపి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలవనే చెప్పాలి. 2004-2014 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో కూడా టిడిపి కూటమికి వైసిపికి మధ్య పోటీ జరిగింది. కానీ వచ్చే ఎన్నికల్లో సీన్ మొత్తం మారిపోబోతోంది. 

 

వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఏకంగా నాలుగు పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార టిడిపితో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు గట్టి పోటీదారుగా ఉన్నాయి. వీటికి అదనంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా అధికారం సాధించటమే లక్ష్యంగా పావులు కదుతుతున్నాయి. లక్ష్య సాధనలో జనసేన, బిజెపిలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది వేరే సంగతి. ఇక, కాంగ్రెస్, వామపక్షాల విషయంలో స్పష్టత లేదనే చెప్పాలి. వామపక్షాలేమో జనసేనతో కలిసి పోటీ చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నాయి.

 

అదే సమయంలో పవన్ ఏమో వచ్చే ఎన్నకల్లో తమది ఒంటరిపోరే అని ఇఫ్పటికి పదిసార్లు ప్రకటించి ఉంటారు. వామపక్షాలు, పవన్ ప్రకటనలో ఎవరు చెప్పేది నిజమ్ అర్ధంకాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు . అదే సమయంలో వైసిపి, జనసేనల మధ్య పొత్తులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వరకూ నిజముందో తెలీదు. ఇప్పటికైతే అధికారం కోసం నాలుగు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయనే చెప్పవచ్చు. అంటే మొదటిసారి రాష్ట్ర చరిత్రలో అన్ని పార్టీలు అధికారం కోసం పోటీ పడబోతున్నాయ్.