ప్రత్యేక విమానాల ఖర్చు రూ 100 కోట్లా ?

గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానాలకు, హెలికాప్టర్లకు అయిన ఖర్చు రూ 100 కోట్లట. రాష్ట్రంలోనే కాదు బహుశా దేశం మొత్తం మీద కూడా ఇంతభారీ ఎత్తున ఖర్చు చేసిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరేమో.  అరిచేదేమో బీదరపులు. రాష్ట్రం అప్పల్లో కూరుకుపోయిందని, లోటు బడ్జెట్లో ఉందని చెబుతుంటారు. కానీ వ్యక్తిగత ఆడంబరాలకు, ఆర్భాటాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదని చెప్పటానికి ఇదే తాజా ఉదాహరణ. ఈ వంద కోట్ల రూపాయలు కూడా కేవలం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చు మాత్రమే.  విదేశీ పెట్టుబడలని ఆకర్షించటం కోసమని, ఏపి బ్రాండ్ వాల్యుని పెంచాలని, పారిశ్రామిక వేత్తలతో భేటీలని సుమారు 20 దేశాలు తిరిగుంటారు. ప్రతీసారి 20 మందికి తక్కువ లేకుండా వెళ్ళేవారు. దానికైన ఖర్చు మళ్ళీ సపరేటు.

చంద్రబాబు చేసిన విదేశీ పర్యటనలు కాకుండా ఉన్నతాధికారులను బృందాలుగా విదేశాల్లో తిప్పారు. వాళ్ళెందుకయ్యా వెళ్ళిందంటే రాజధాని నిర్మాణం కోసం విదేశాల్లోని రాజధానులను పరిశీలించటానికట.  వెళ్ళి ఏం చేశారంటే జస్ట్ ఎంజాయ్ చేసొచ్చారనే చెప్పాలి. ఎందుకంటే, విదేశాలకు వెళ్ళి రాగానే చాలామంది ఉన్నతాధికారుల శాఖలను మార్చేసేవారు.

ఇలా తలా తోకా లేకుండా కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని ఖర్చు చేసుంటారు.  చెప్పేది అప్పుల్లో ఉన్న బీద రాష్ట్రమని. చేసేదేమో ఆర్భాటపు ఖర్చులు. అంటే అప్పు చేసి పప్పుకూడు తినటమన్నమాట. ఇటువంటి ఖర్చులన్నీ కలిపే రూ 16 వేల లోటు బడ్జెట్ తో మొదలైన ఏపి ఆర్ధిక పరిస్ధితి ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్ల అప్పులకు చేరుకుంది.