రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రజా వ్యతిరేకత నుంచి కాపాడేందుకు పవన్ కల్యాణ్ మరోసారి ‘డైవర్షన్ పాలిటిక్స్’కు తెరలేపారని ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు.
రైతుల కష్టాలు పట్టవా? రాష్ట్రంలో రైతులు పంట నష్టాలు, అప్పుల భారంతో కుంగిపోతున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. “పంట అమ్ముకుంటే కోత ఖర్చులు కూడా రావని రైతులు పొలాల్లోనే పంటను వదిలేసి, రోడ్లపై పారబోస్తున్నారు. వారికి మద్దతు ధర, నష్టపరిహారం ఇప్పించడం కోసం పోరాడాల్సింది పోయి.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగి వార్తలను పక్కదారి పట్టిస్తున్నారు,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గోబెల్స్‌ను కూడా మించిపోయారని, ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలనే లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.
మౌనమే సమాధానమా? గతంలో రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, సుగాలి ప్రీతి మృతికి వైసీపీనే కారణమని పవన్ ప్రచారం చేశారని గుర్తు చేశారు. అయితే, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయాలపై పవన్ మౌనంగా ఉండటాన్ని బట్టి, అవన్నీ తప్పుడు ప్రచారాలేనని నిరూపితమైందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నెయ్యి వివాదం కూడా ఆ కోవలోనిదేనని కొట్టిపారేశారు.

పవన్‌కు సూటి ప్రశ్నలు సంచలన ఆరోపణలు చేసే ముందు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పవన్‌కు అంబటి పలు ప్రశ్నలు సంధించారు:
ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? లేదా?
నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎక్కడైనా నిర్ధారణ అయిందా?
సిట్ (SIT) విచారణ జరుగుతుంటే, అధికారిక ల్యాబ్ రిపోర్టులు విడుదల చేయకుండా ఎంపిక చేసిన లీకులు ఎందుకు బయటకు వదులుతున్నారు?
విశాఖ బీఫ్ ఘటనపై ఎందుకు మాట్లాడరు? విశాఖలో టీడీపీ నేతలతో సంబంధమున్న 200 టన్నుల నిషేధిత బీఫ్ పట్టుబడితే పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని అంబటి నిలదీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గోశాలలో వందల ఆవులు చనిపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. “చంద్రబాబు హయాంలో వినియోగించిన ట్యాంకర్ల గురించే ఇప్పుడు మాట్లాడుతూ, మమ్మల్ని నిందించడం విడ్డూరంగా ఉంది. మా హయాంలో కేజీ నెయ్యి ధర రూ. 326 ఉంటే అవినీతి అన్నారు.. మరి చంద్రబాబు హయాంలోని రూ. 276, రూ. 295 ధరల గురించి ఏం సమాధానం చెబుతారు?” అని అంబటి ప్రశ్నించారు.
తిరుమల క్షేత్రం రాజకీయాలకు వేదిక కాదని, ప్రజల విశ్వాసం పవిత్రమైనదని, అది చంద్రబాబుకు రాజకీయ కవచం కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

