చంద్రబాబు ఆధిపత్యాన్నే ప్రశ్నిస్తున్నారా ?

ఇపుడిదే ప్రశ్నపై  పార్టీ సీనియర్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత చంద్రబాబునాయుడు చెబితే వినే నేతల సంఖ్య బాగా తగ్గిపోయిందని అర్ధమైపోతోంది.  కాకినాడలో జరిగిన మొన్నటి కాపు నేతల సమవేశం తర్వాత ఈ విషయం పార్టీలో అందరికీ బాగా అర్ధమైపోయింది.

కాపు నేతల సమావేశం ఓ విధంగా చంద్రబాబు ఆధిపత్యాన్ని ప్రశ్నించటమనే అనుకోవాలి.  ఏ పార్టీకైనా ఎన్నికల్లో  గెలుపోటములు సహజమే అయినా మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి మాత్రం ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఇంత ఘోర పరాజయం పార్టీకి  ఎప్పుడూ ఎదురు కాలేదు. దాంతోనే చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలు పెరిగిపోయాయి.

ఈ నేపధ్యంలోనే కాకినాడలో సమావేశమైన కాపు నేతల్లో పేరుకుపోయిన అసంతృప్తి బయటకు వచ్చిందని సమాచారం. ఆ అసంతృప్తి అంతా చంద్రబాబుపైన కాకుండా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ మీదే అని బయటపడింది. తూర్పుగోదావరి జిల్లాలో తిరుగులేని బిసి నేతైన యనమల కాపు నేతలను తొక్కేస్తున్నట్లు చాలామంది మండిపోతున్నారు.

ఇంకా తమ మీద యనమల ఆధిపత్యాన్ని రుద్దితే సహించ కూడదని కూడా నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని జూలై 1వ తేదీన చంద్రబాబుతో జరగబోయే సమావేశంలో స్పష్టం  చేయాలని కూడా నిర్ణయించారట. అలాగే లోకేష్ ఆధిపత్యాన్ని కూడా తగ్గిస్తే బాగుంటుందని సూచన చేయాలని నిర్ణయించుకున్నారట. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ఆధిపత్యం బాగా పెరిగిపోయిందనే భావనలో ఉన్నారు కాపు నేతలు.