అబ్బా తమ్ముడూ… ఆధారాల సంగతి మనకెందుకు?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహా బ్లాక్ లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం తో పాటు ఇన్న‌ర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు, ఫైబ‌ర్‌ నెట్ కేసు.. ఇలా చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన ఒక్కో అవినీతి బాగోతాన్ని త‌వ్వితీసే ప‌ని పెట్టుకుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన మెంట్ తో పాటు బాబుకు బోనస్ గా అంగళ్లు అల్లర్ల కేసు కూడా ఒకటుంది. ముందుగా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో బాబు సెంట్రల్ జైల్లో ఉండి ఇప్పటికే మూడు వారాలూ దాటేసింది. బ‌య‌టికి రావ‌డానికి శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నా ఇప్పటివరకూ అయితే ఆ సూచనలు ఏమీ కనిపించడం లేదనే తెలుసుంది.

సపోజ్, ఫర్ సపోజ్… ఒక‌వేళ స్కిల్ స్కాం లో బెయిల్ వచ్చి బ‌య‌టికి వ‌చ్చినా త‌ర్వాత మిగిలిన కేసులు ఆయ‌న కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు ఫ్యామిలీ, టీడీపీ లీడ‌ర్లు.. చేసే కామెంట్లు, ఇచ్చే స్టేట్‌ మెంట్లు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. కారణం ఈ కేసు పై వారు చేస్తున్న వాదనే!

ఏదైనా అవినీతి ఆరోప‌ణ వ‌స్తే అది ఏపార్టీ నాయకుడైనా… మేం ఎలాంటి అవినీతి చేయ‌లేద‌ని, అసలు తమ హయాంలో అవినీతే జరగలేదని వాదిస్తారు. కేసు పెడితే కోర్టులోనూ అదే చెబుతారు. కానీ చంద్రబాబు స్కిల్ స్కాం లో టీడీపీ లీడర్ల వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అసలు స్కాం జరగలేదని ఎవరూ చెప్పడం లేదు! చంద్రబాబుది బాధ్యత కాదు, అధికారులది బాధ్యత అని ఒకరంటే… ఆధారాలు లేకుండా అరెస్టులు ఏమిటి అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడే తమ్ముళ్లు లాజిక్ మిస్సవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మినిమం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినా… కోర్టు రిమాండ్ ఇవ్వదు కదా! కస్టడీకి ఇస్తే విచారణలో మరిన్ని ఆధారలు దొరుకుతాయని చెబుతున్నారు. అయితే టీడీపీ లీడ‌ర్లు మాత్రం అవినీతి చేయ‌లేద‌ని వాదించ‌కుండా.. ఆధారాల్లేవుగా అని ప్ర‌శ్నిస్తున్నారు. అవినీతి జరిగితే అధికారులది బాధ్యత తప్ప బాబుది కాదని మరో కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు.

దీంతో… ఇక్కడే తెలిసిపోతోంది ఆ వ్యవహారంలో బాబు తరుపున ఉన్న డొల్లతనం అంతా అని అంటున్నారు పరిశీలకులు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందా.. జరగలేదా? సీమన్స్ తో ఒప్పందం జరిగిందా లేదా? 90 % – 10% అగ్రిమెంట్ నిజమా కాదా? వీటికి సమాధానాలు చెప్పడం మానేసి… ఆధారలు లేని కేసు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు తమ్ముళ్లు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… నిజంగా ఆధారలు లేకుండా బాబుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే, కడిగిన ముత్యంలా బాబు బయటకు వస్తారు. అప్పుడు జనాల్లో పాపులారిటీ మరింత పెరుగుతుంది కదా! సపోజ్ ఆధారాలు ఉంటే… తప్పు చేశాక శిక్ష తప్పదుగా!!