దేశ రాజకీయాలపై జగన్ మార్క్: సంక్షేమ మంత్రమే విజయ సూత్రం.!

Jagan Mark on Politics: Welfare Mantra is the Success Principle!

Jagan Mark on Politics: Welfare Mantra is the Success Principle!

ఇకపై ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి అనేది తర్వాతి సంగతి.. ముందైతే, సంక్షేమమే అసలు సిసలు ఎజెండా. సంక్షేమ పథకాలతో జనాన్ని సోమరిపోతుల్ని చేసేస్తున్నారంటూ ఓ పక్క ప్రజాస్వామ్యవాదులు గగ్గోలు పెడుతున్నా.. ఆ సంక్షేమం వైపే జనం మొగ్గు చూపుతున్న విషయాన్ని ఎలా విస్మరించగలం.? ప్రజా రంజకమైన పాలన అంటే ఏంటి.? ప్రజలు మెచ్చుకునేలా పరిపాలించడం. ప్రజలకు ఏం కావాలో అదిచ్చేస్తే సరి. ఆంధ్రపదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ఫలితాలు, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చెప్పిందదే. అందుకే, దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి సంగతి పక్కన పెట్టి, సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతున్నాయి.

ఎన్నికలు జరుగుతున్న వివిధ రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో ఉచిత పథకాలకే అగ్రతాంబూలమిస్తున్నాయి. పెట్రోలు ధర తగ్గించేస్తాం.. ఉచితంగా వాషింగ్ మెషీన్లు అందిస్తాం.. అంటూ తమిళనాడులో ఎన్నికల మేనిఫెస్టోలు తెరపైకొస్తున్నాయి. తప్పొప్పుల బేరీజు ఇక్కడ ఇప్పుడు అనవసరం.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వమే, నిధుల వేటలో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని అమ్మేస్తోంది. అందినకాడికి అప్పులు చేసేస్తోంది. సో, కరోనా పాండమిక్ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పులు చేయడం అనేది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. సరే, ఆ అప్పులు చివరికి తీర్చాల్సింది ఎవరు.? అంటే, ప్రజలేననుకోండి.. అది వేరే సంగతి. కానీ, ప్రజల్లో ఈ ఆలోచనా శక్తి తగ్గిపోయాక, అభివృద్ధి అనవసరం.. సంక్షేమ పథకాలే ముఖ్యం.. అనుకున్నప్పుడు ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేయడమే పాలకులు చేయాల్సిన పని. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్నా, రేప్పొద్దున్న వేరే రాష్ట్రాల్లో ‘ఉచిత పథకాలు’ అమలు చేయాల్సి వచ్చినా.. అది ప్రజాభీష్టం మేరకే. ప్రజాభీష్టం నెరవేర్చడమే పాలకుల పని.