చంద్రబాబు ఇల్లు కూలగొట్టడం ఖాయమేనా ?

తానుంటున్న అక్రమ కట్టడాన్ని చంద్రబాబునాయుడు తొందరలో ఖాళీ చేయక తప్పదనే అనిపిస్తోంది. అక్రమ నిర్మాణాల్లో నుండి చంద్రబాబును ఖాళీ చేయించటం ఖాయమంటూ మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిజానికి ముఖ్యమంత్రిగా ఉండి ఓ అక్రమ కట్టడాన్ని క్యాపు కార్యాలయంగా మార్చుకున్న ఘనత చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు సిఎం కాగానే కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల్ని కూల్చేస్తానని నోటీసులిచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం.

ఆ తర్వాత ఓ అక్రమ కట్టడంపై మనసు పారేసుకున్న చంద్రబాబు దాన్నే క్యాంపాఫీసుగా మార్చేసుకున్నారు. తానున్నదే అక్రమ కట్టడమైతే పక్కనే ప్రజావేదిక పేరుతో ప్రభుత్వంతోనే మరో అక్రమ నిర్మాణాన్ని చేయించిన ఘనుడు చంద్రబాబు.  అధికారంలో ఉండగా  చేసిన పనికి సిగ్గు పడాల్సిన  చంద్రబాబు తాజాగా రెండు నిర్మాణాలను తనకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరటం మరో విచిత్రం.

అయితే ఆ విషయమై ఆళ్ళ మాట్లాడుతూ చంద్రబాబును ఆ అక్రమ కట్టడాల నుండి ఖాళీ చేయించటం ఖాయమన్నారు. అక్రమ నిర్మాణంలో ఉన్న చంద్రబాబును అందులో నుండి ఖాళీ చేయించేవరకూ వదిలిపెట్టేది లేదన్నారు.  ఐదేళ్ళు అమరావతి పరిధిలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయినా చంద్రబాబు నిజంగా సిగ్గు పడాలన్నారు.

తనకు సొంత ఇల్లు కూడా లేని చంద్రబాబు తాడేపల్లిలో రెండెకరాలు కొనుక్కుని సొంత ఇంటిని కట్టుకున్న జగన్ పై విమర్శలు చేయటమే విడ్డూరంగా ఉంది. ఎన్నికలైపోయిన తర్వాత కూడా సొంత ఇంటి విషయంలో జగన్ ను చంద్రబాబు ఎన్నిసార్లు ఎగతాళిగా మాట్లాడారో లెక్కేలేదు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండే జగన్ కు ఏపి రాజకీయాలతో ఏమి పనంటూ ఎన్నోసార్లు ఎగతాళిగా మాట్లాడారు.

సరే చంద్రబాబు ఏమి మాట్లాడినా జనాలైతే ఏ తీర్పిచ్చారో అందరూ చూసిందే. మొత్తానికి వైసిపి వరస చూస్తుంటే చంద్రబాబును కరకట్ట నుండి ఖాళీ చేయించేట్లే కనిపిస్తోంది. పైగా ఏ విషయాన్నైనా ఆళ్ళ పట్టుకుంటే వదిలిపెట్టరు. విషయమో సాంతం తేలిపోయేంత వరకూ పట్టిన పట్టు వదిలిపెట్టరు. అలాంటి ఆళ్ళ ఇపుడు ఈ అక్రమ కట్టడంపై కన్నేశారు. కాబట్టి చంద్రబాబుకు ఖాళీ చేయక తప్పేలా లేదు.