జనసేన, టీడీపీ కలిస్తే వైసీపీని ఓడించేస్తాయా.?

if-janasena-and-tdp-unite-will-they-defeat-ycp

if-janasena-and-tdp-unite-will-they-defeat-ycp

పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పెద్దగా ఏమీ మారలేదు. కానీ, మార్చేయాలన్న తాపత్రయం మాత్రం టీడీపీ అనుకూల మీడియా వర్గాల్లో కనిపిస్తోంది. టీడీపీ – జనసేన ఓటు బ్యాంకు చాలా చోట్ల, వైసీపీ ఓటు బ్యాంకు కంటే ఎక్కువన్నది టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయ పడుతున్న ఓ టీడీపీ అనుకూల మీడియా సంస్థ.

ఇదే మీడియా సంస్థ, జనసేన కారణంగా టీడీపీ ఓటు బ్యాంకు దెబ్బ తినేసిందంటూ వరుసగా కథనాల్ని వండి వడ్డిస్తోంది. అయితే, పంచాయితీ ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు జనసేన ఓటు బ్యాంకు మునిసిపల్ ఎన్నికల నాటికి బాగా తగ్గిపోయింది. కారణాలేంటన్నదానిపై జనసేన విశ్లేషించుకోవాల్సి వుంది. జనసేన సొంతంగా ఎన్నికల బరిలోకి దిగితే, మెరుగైన ఓటు బ్యాంకు లభించే అవకాశం వుంది. అదే, వేరే ఏ పార్టీతో కలిసినా జనసేన ఓటు బ్యాంకు దారుణంగా దెబ్బ తింటుంది.

ఈ విషయమై జనసేన పార్టీకీ ఇప్పుడిప్పుడే ఓ స్పష్టత వస్తోంది. అందుకే, మిత్రపక్షం బీజేపీని కూడా లైట్ తీసుకోవాలన్న ఆలోచనలో వుంది జనసేన. ఇంకోపక్క టీడీపీతో కలిస్తే జనసేనకు రాజకీయంగా నష్టం తప్ప లాభం వుండబోదు. కొన్ని సీట్లు జనసేనకు, టీడీపీతో పొత్తు వల్ల దక్కవచ్చుగానీ, జనసేన రాజకీయంగా ఎదగాలంటే ఒంటరి ప్రయాణమే మేలన్న విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడో గుర్తించారు. ఇక, వైసీపీ నేతలు జనసేనను విమర్శించే తీరు, టీడీపీ నేతలు జనసేనను విమర్శించే తీరు చూస్తే, టీడీపీ తీరే అతి భయానకంగా వుంటుంది. టీడీపీ నేతలు తేనెపూసిన కత్తిలా వ్యవహరిస్తే, టీడీపీ మద్దతుదారులు మాత్రం అత్యంత హేయంగా జనసేనను విమర్శిస్తుంటారు. వైసీపీ తీరు వేరు. ఈ వాస్తవాల్ని జనసైనికులు ఎప్పుడో గుర్తించారు. అందుకే, టీడీపీతో భవిష్యత్తులో పొత్తు అనేది జరిగే పని కాదంటున్నారు. టీడీపీ ఆరిపోయిన దీపం, ఆ పార్టీ గురించి, ఆ పార్టీతో పొత్తు గురించి జనసేన ఆలోచిస్తుందని అనుకోలేం.