ఇల్లు కొనుగోలు చేసే వాళ్ళకు గుడ్ న్యూస్

తాజా బడ్జెట్లో కేంద్రప్రభుత్వం ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళపై కాసిన్ని వరాలు కురిపించిందనే చెప్పాలి.  మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళకు కేంద్రం ప్రోత్సాహకం ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రూ 45 లక్షల ఖరీదైన ఇల్లు కొనేవాళ్ళకు  రూ 3.5 లక్షల మేర వడ్డీ రాయితీ  ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా హోం లోన్ తీసుకునే వాళ్ళకు మరో లక్షన్నర రూపాయల వరకూ వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. ఇళ్ళ నిర్మాణ రంగంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లు చెప్పారు.  కేంద్రమంత్రి చెప్పినట్లుగా నిజంగానే పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇళ్ళ నిర్మాణ ప్రాజెక్టులు చేపడితే ముందుగా మధ్య తరగతి జనాలకు మంచిదే.

నిజానికి 130 కోట్ల మంది జనాలున్న ఈ దేశంలో అందరికీ సొంతిల్లు అందించటమన్నది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు.  ఒకవైపు జనాభా పెరిగిపోతోంది మరోవైపు ఇళ్ళ ప్రాజెక్టుల నిర్మాణానికి  స్ధలం కొరత పట్టి పీడిస్తున్నది.  ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఎలాగూ సృష్టించలేరు. అలాంటపుడు జనాభా నియంత్రణనైనా చేస్తున్నారా అంటే అదీ లేదు.

ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక స్కీంలు పెట్టి పక్కా ఇళ్ళ నిర్మాణమాలు చేస్తున్నా ఇంకా అందిరికీ సొంతింటి కల తీరటం లేదంటే అర్ధమేంటి ? ప్రభుత్వాలు చెప్పేదంతా ఉత్త సొల్లనే. దేశంలో అందరికీ కాకపోయినా కనీసం అవకాశం ఉన్న వాళ్ళకైనా సొంతిళ్ళు సమకూరితే అదే పదివేలు.