(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం, కాంగ్రెస్ తో కలసి పనిచేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు నిర్ణయించుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ సృష్టించింది.
ఈ వార్త తనకు తానుగా పాపులర్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, వైసిపి నేతలు,జనసేనాని పవన్ కల్యాణ్, బిజెపి నేతలు కలసి ఈ చిన్న ఇవెంట్ ను నేషనల్ ఇవెంట్ గా మార్చారు. ట్విట్టర్, ఫేస్ బుక్ , టివిల, వార్త పత్రికలను ఉపయోగించుకుని అరగంట కలయిక పదిరోజులుగా పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు. ఆ రెండు పార్గీలకు కలయిక దేశానికి ప్రమాదమని బిజెపి, తెలంగాణ కు ముప్పుఅని టిఆర్ ఎస్, అదొక అవకాశవాదకలయిక అని వైసిపి ఇలా ఎవరంతకు వాళ్లు చంద్రబాబు-రాహాల్ సమావేశానికి వారంరోజుల ముందుకు నుంచి అరుస్తూనే ఉన్నారు. రాహుల్, చంద్రబాబు అంత ప్రమాదకరమయిన నిర్ణయాలు తీసుకున్న ందుకు ఈ పార్టీలన్నీ సంతోషించాలి, ఎగిరి గంతేయాలి, టపాసులు కాల్చాలి, పాలభిషేకాలు చేయాలి. ఎందుకంటే, ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, టిడిపిల ఓటమిని కోరుకుంటున్నవే. అలాంపుడు ఓటమి దిశలో కాంగ్రెస్ , టిడిపిలు కదులుతూ ఉంటే, జుట్టు పీక్కోవడమెందుకు?
ఆ రెండు పార్టీలు పతనమయితే పండగ చేసుకోవాలిగాని, నిద్రాహారాలు మాని రేయింబగలు తిట్టడమెందుకు? ఈ మొత్తం వార్తని ఇగ్నోరించి.. ఇక మేమే గెలుస్తున్నామని ముందుస్తు వూరేగింపులు తీయవచ్చుగా…
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిందని, ఎన్టీరామారావు కాంగ్రెస్ ను తుదముట్టించేందుకు పార్టీ పెట్టారని, అలాంటి తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కాళ్ల బేరానికి తీసుకు వెళ్లారని తెగ ఫీలయిపోతున్నారు ఈ మహానేతలంతా. టిఆర్ ఎస్ నేత ఒకరు టిడిపిని ఢిల్లీకి బానిస చేశారని ఎంతో వాపోయారు. తెలుగుదేశం ఎపుడూ అవకాశవాదమేనని పవన్ కల్యాణ్ పెద్ద క్యాలెండర్ ను టిట్టర్ కు తగిలించారు. ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. తాననుకున్న ఇజాన్ని ఎపుడో గాలికొదిలేశారు. ఇజం తెస్తానన్నపుస్తకాలే తేలేదు. తెచ్చిన ఒక పుస్తకం ఆయనకు ఇజం, సిద్ధాంతం గురించి ఒనమాలు కూడారావని చెబుతాయి. మొన్నమొన్నటి దాకా తెలుగుదేశం పవర్ నీడలో హాయిగా ఉండి ఇపుడు తెల్లవారిందని, తెల్లవారించింది తనే నని అరుస్తున్నారు.
Sri CBN’s way in politics: Ritualistically opportunistic. pic.twitter.com/VTaGtx30oa
— Pawan Kalyan (@PawanKalyan) November 3, 2018
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకమని చెప్పడం నిజమయిన అవకాశవాదం. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలు అనుకున్నంత కాంగ్రెస్ వ్యతిరేకి కాదు. ఎందుకంటే, కొన్ని కీలకమయిన సందర్భాలలో అదే కాంగ్రెస్ పార్టీకి టిడిపి సహకరిచింది. ఆ పని చేసింది ఎవరో కాదు, పార్టీ సంస్థాపకుడు ఎన్టీరామారావే. ప్రధాని పివి నరసింహారావు నంద్యాలనుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నపుడు ఎన్టీ రామారావు తెలుగు ఆత్మగౌరవం అంటూ టిడిపి అభ్యర్థిని పోటీకే పెట్టలేదు. మరీ తెలుగుదేశం పార్టీ అంతకరుడు గట్టిన కాంగ్రెస్ వ్యతిరేకి అయితే, ప్రధాని ని ఓడించి తన కాంగ్రెస్ వ్యతిరేకతని, కసిని చాటుకుని ఉండవచ్చుగా.
అన్ని రాజకీయ పార్టీల్లాగానే తెలుగుదేశం పార్టీ అవకాశ వాదియే. అవకాశవాదం బూతు మాట కాదు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అవకాశాలొచ్చినపుడు వినియోగించుకోవాలని ఎంతమంది సలహా లు ఇవ్వడంలేదు. పాత, కమ్యూనిస్టు బూజు పట్టిన చింతకాయ పచ్చడి పదజాలం నుంచి వచ్చిన మాటే అవకాశం వాదం అనేది. అది మహా పాపకార్యం అనేది ఆరోజుల్లో వాళ్ల ధోరణి.
ఎన్టీఆర్కు రెండో వెన్నుపోటు!
-చనిపోయినా చంద్రబాబు ఆయన్ను వదలడం లేదు
-పాము, ముంగీసలు ఒక్కటయ్యాయ్..
-బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతున్నది
-గత పాలకుల నిర్లక్ష్యంతోనే వస్త్రరంగంలో సంక్షోభం
-మరో తిరుపూరులా సిరిసిల్ల కావాలి
-సిరిసిల్ల నేతన్నల కృతజ్ఞత సభలో మంత్రి @KTRTRS pic.twitter.com/PaK4pWhdxl— KTR News (@KTR_News) November 3, 2018
టిడిపి కాంగ్రెస్ కలుస్తున్నాయనగానే ఈ రెండు పార్టీల వ్యతిరేకులందరికి సిద్ధాంతాలు గుర్తొస్తున్నాయి. సిద్ధాంతాలమీద పార్టీలు నడుస్తున్నాయా? ఏ పార్టీ ఏ సిద్ధాంతామో జాబితా తయారుచేయగలరా? భారత దేశంలో ప్రత్యర్థుల తో కలవని పార్టీలు లేవు. ఒక సారి నేరుగా కలస్తే మరొక సారి పరోక్షంగా కలిశాయి. మొన్నటికి మొన్న కెసియార్ కాంగ్రెస్ తో కలిశారు. సోనియమ్మకు పాదాభివందనం చేశారు. సకుటుంబ సపరివారంగా సోనియా ఇంటికి వెళ్లి పేరుపేరునా అందరని పరిచయం చేసి స్నాక్స్ తినిరాలేదా. ఆ తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీతో కలసి 2009 ఎన్నికల్లో పోట ీచేయలేదా? వైసిపి అధినేత, సోనియాగాంధీకి ఉన్నవి సైద్ధాంతిక విభేదాలా? లేక పవర్ పాలిటిక్సా? బిజెపికి వైసిపికి ఉన్నవి సైద్ధాంతిక సారూప్యాలా. కెసిఆర్ జగన్ ల మధ్య అదరాభిమానాలు సైద్ధాంతికమయినవా, అలాంటపుడు జగన్ మీద రాల్లేసిన రోజులేమయ్యాయి.కెసిఆర్ బిజెపి స్నేహం రంగు రచి వాసన ఏమిటి? కాంగ్రెస్ బిజెపి కలసి కేంద్రంలో మూడో ఫ్రంటును నిలబెట్టలేదా. ఎన్ని విషయాల్లో వామపక్షాలు, బిజెపి ఒక సైడున నిలబడుకోలేదు. తెలంగాణని వ్యతిరేకించిన వారందరిని క్యాబినెట్ లోకి చేర్చుకుని అమరవీరుల ఆత్మలకు శాంతిలేకుండా చేయడం ఏ సిద్ధాంతమో చెప్పాలి.
రాజకీయాలలో అవకాశాలను వాడుకుని అధికారంలోకి రావడం కమ్యూనిస్టుల దగ్గిర నుంచి తెలుగుదేశం దాకా అందరికీ అలవాటే. భారతదేశంలో ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. అన్ని అవకాశ వాద పార్టీలే. టిడిపి, కాంగ్రెస్ కలవానుకోవడం ఎలా అవకాశవాదమో, అవి కలవకూడదనుకోవడం అవకాశవాదమే.
ప్రత్యర్థి పార్టీలు కలవడమనేది ఒక సారి సమస్యల మీద జరగవచ్చు. మరొక సారి వోట్ల కోసం కావచ్చు. ఏ వయినా రెండు పార్టీ లు కలిస్తే కలవరపడుతున్నారంటే, ఈ కలయిక ఆశించిన ఫలితాలిస్తుందేమోననే భయం ఉన్నట్లే లేక్క. తెలంగాణాలో కాంగ్రెస్ టిడిపి కలిస్తే … ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు గాని, టిఆర్ ఎస్ భయం చూస్తే ఏదో ముప్పు ఆ పార్టీకి ఎదురవబోతున్నదా అనే అనుమానం కలుగుతుంది.
ఎందుకంటే, తెలంగాణ వచ్చిన సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కెసియార్ కు అఖండ విజయం ఇవ్వలేదు. తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్ర పార్టీ టిడిపికి 15 స్థానాలిచ్చారు. 60 యేళ్లు తెలంగాణ ను నాశనం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని బలమయిన ప్రతిపక్ష పార్టీ చేశారు. ఈ పార్టీల ఎమ్మెుల్యేలను ఫిరాయింపచేసి టిఆర్ ఎస్ బలపడిందని అందరికీ తెలుసు. అంతెందుకు టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి ఒక దశలో టిఆర్ ఎస్ పార్టీ సిద్ధమయింది. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా బహిరంగంగా చెప్పారు. మీడియాలో రాజకీయ పండితులు విపరీతంగా విశ్లేషణలు రాశారు. దీన్ని చెడగొట్టింది బిజెపి అనేది నాయుడి ఆరోపణ. అలాంటపుడు అదే టిడిపి, కాంగ్రెస్ లు కలిస్తే ఏమయినా జరగవచ్చు. అదే టిఆర్ ఎస్ బెంగ లాగా ఉంది. ఇక్కడ పొరపాటున మహాకూటమి గెలిస్తే… ఆంధ్రమీద దాని ప్రభావం ఉంటుందనే భయం వైసిపిలో కూడా ఉన్నట్లుంది. బిజెపి గురించి తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. తెలుగు వాళ్లు 2014లో మోదీని లెక్కే చేయలేదు.
కాంగ్రెస్ -టిడిపి కూటమి మంచిదో చెడుదో ప్రజలు నిర్ణయిస్తారు.అది ఆపవిత్ర కూటమి అవునో కాదో పోలింగయ్యాక తెలుస్తుంది. అయితే, ఈ మధ్యలో ఈ కూటమికి మంచి ప్రచారం తెచ్చే పనిలో కెసియార్, కెటియార్, హరీష్ రావు, వారి సైన్యం, వైసిపి సైన్యం, జనసేన సైన్యం, కమలబలగం… నిమగ్నమయి ఉంటాయి.
(ఇందులో రాసిన అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం. తెలుగు రాజ్యంకు సంబంధలేదు.)