సోషల్ మీడియాలో మరోసారి రాజకీయ పార్టీ ఖాతా హ్యాకింగ్ సంచలనం సృష్టించింది. ఈసారి బారినపడ్డది జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (ప్రస్తుతం ఎక్స్). ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలు, పవన్ కల్యాణ్ సభల ఫొటోలు, వీడియోలు కనిపించే ఆ ఖాతాలో అకస్మాత్తుగా “ఇన్వెస్ట్‌మెంట్”, “ట్రేడింగ్” పోస్టులు దర్శనమివ్వడంతో ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకూ జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా పూర్తిగా హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని సమాచారం.
పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఎప్పుడూ రాజకీయ పోస్టులతో యాక్టివ్‌గా ఉండే జనసేన ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి పోస్టులు ఎలా వచ్చాయి.. అని వారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఐటీ విభాగం వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించింది. ఖాతా పునరుద్ధరణ కోసం సాంకేతిక బృందం అత్యవసర చర్యలు ప్రారంభించింది.
జనసేన నాయకత్వం హ్యాకింగ్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కేవలం సాంకేతిక దాడా, లేక రాజకీయంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో సోషల్ మీడియాలో #JanaSenaTwitterHacked అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఇదే కాకుండా, ఇదే తరహా ఘటన గతంలో కూడా జరిగింది. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అయ్యింది. ఆ సమయంలో పార్టీ వీడియోలు తొలగించి, బిట్‌కాయిన్ సంబంధిత వీడియోలు అప్‌లోడ్ చేసిన హ్యాకర్లు, ఛానల్ పేరును “మైక్రో స్ట్రాటజీ”గా మార్చేశారు. ఆ సంఘటనతో పెద్ద వివాదం నెలకొంది. ఇప్పుడు మళ్లీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కావడం జనసేన కార్యకర్తల్లో ఆందోళన రేపుతోంది.
పవన్ కల్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ హ్యాకింగ్ సంఘటన జరగడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ టెక్ టీం వెంటనే చర్యలు తీసుకుంటూ ఖాతా పునరుద్ధరణకు కృషి చేస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. జనసేన ట్విట్టర్ హ్యాక్ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అభిమానులు “పార్టీ ఇమేజ్ దెబ్బతీసేందుకు ఇదో పన్నాగం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి.. జనసేన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మళ్లీ హ్యాకర్లు షాక్ ఇచ్చారు.
