ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మత్స్యకారుల సమస్యలను సావధానంగా విని, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ముఖ్యంగా, పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యంతో బాధపడుతున్న స్థానిక మత్స్యకారులకు అండగా నిలిచారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘మత్య్సకారులతో మాటా మంతి’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తమ గోడును పవన్ కళ్యాణ్ ముందు వెళ్లబోసుకున్నారు. సాగర తీరంలో పరిశ్రమల కాలుష్యం కారణంగా తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
”వైఎస్ఆర్సీపీ టాక్స్ – కర్నూలు” కొత్త యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
రాజకీయాలు వేరు, స్నేహం వేరు! ఒకే ఫ్రేమ్‌లో వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీ
దీంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, ఉప్పాడలోని పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, దీనిపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. “ఈ సమస్యను వంద రోజుల్లోగా పరిష్కరించేందుకు అవసరమైన నిర్ణయం తీసుకుంటామని” స్థానిక మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. మొత్తం 18 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి బీమా కింద రూ.5 లక్షల చొప్పున చెక్కులను పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారు.
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఇందుకోసం ఇప్పటికే స్పెషల్ కమిటీని కూడా నియమించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.

