హైకోర్టు విభజన పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఉన్న కేసుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి హైకోర్టు విభజన కావడం, జనవరి 1 వ తేది నుంచి కోర్టులు వేరువేరుగా పనిచేయనుండడంతో ఆయన కోర్టు నిర్వహణ పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక భవనం పూర్తయ్యే వరకు సెక్రటేరియట్ లోనే ఉమ్మడి హైకోర్టు నడవాలని నిర్ణయించారు. జగన్ పై చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.
ఉమ్మడి హైకోర్టు విభజనకు, వైఎస్ జగన్ పై నమోదయిన కేసులకు మధ్య లింక్ ఉంది. కేవలం హైకోర్టునే కాకుండా సిబిఐ కోర్టును కూడా విభజించాలి. సిబిఐ కోర్టు విభజన జరిగితే జగన్ పై విచారణ పూర్తయిన కేసులన్నీ మళ్లీ మొదటికి వస్తాయి. జగన్ కేసుల పై అనుమానాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది. హైకోర్టు విభజనలో సైతం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తరహాలో హైకోర్టు విభజనకు మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. కేంద్ర నిర్ణయం కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక భవనం పూర్తి కాలేదు. ప్రస్తుతానికి సచివాలయం కేంద్రంగానే హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయి. అందుకు కావాల్సిన భవనం సిద్దమైంది. జనవరి 1 నుంచి హైకోర్టు అమరావతి కేంద్రంగా పని చేస్తుంది. అని చంద్రబాబు అన్నారు.
జగన్ కేసుకు, హైకోర్టు విభజనకు సంబంధం ఉందని చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు హాట్ టాపికయ్యాయి. చంద్రబాబు అలా ఎందుకన్నారనే చర్చ జరుగుతోంది.
