కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్టీ నేతలతో చంద్రబాబు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు ఏమన్నారంటే…

“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు రాష్ట్రాలకు రాజులా ఫీల్ అవుతున్నాడు. జగన్ ను ఏపీకి సీఎం ని చేసి సామంత రాజుని చేయాలని చూస్తున్నాడు. ఏపీలో టిడిపి వస్తే కేసీఆర్ ఆటలు సాగవని ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడు. కొంత మంది సినీ హీరోలు నేరస్తుడిని కలుస్తున్నారు. నేరస్తులను కలవడం దేనికి సంకేతమో అర్దం చేసుకోవచ్చు. హైదరాబాదులో సెటిల్ అయిన వారిని, ఆస్తులు ఉన్న వారిని కేసీఆర్ బ్లాక్ మొయిల్ చేస్తున్నాడు. ఎన్ని చేసినా కేసీఆర్ ఆటలు సాగవు. అవి ఏపీ ప్రజల ముందు పనికి రావు.

నేటితో బిజెపి ఏపీకి నమ్మక ద్రోహం చేసి ఐదేళ్లు. బిజెపి నమ్మక ద్రోహాన్ని ఎండగట్టాలి. ఆర్థిక లోటులో నాలుగో వంతు కూడా కేంద్రం సహాయం చేయలేదు. కేంద్రం పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదు. ఇచ్చిన రూ.350 కోట్ల రూపాయలను వెనక్కు తీసకుంది. బిజెపి నమ్మక ద్రోహాన్ని ఎండగట్టాలి. ఇప్పటికే అభ్యర్దుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాం. అంతా సమన్వయంగా పని చేయాలి. దాదాపు ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్టే. అంతా కూడా ఉత్సాహంగా, దైర్యంగా ముందుకు నడవాలి.” అని చంద్రబాబు అన్నారు.

ఎన్నడు లేని విధంగా చంద్రబాబు కాస్త డోస్ పెంచి మాట్లాడడంతో ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయాన కేసీఆర్ తన ప్రచారంలో చంద్రబాబు పైనే విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.దీంతో వైసిపిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు కేసీఆర్ పై విమర్శలు ఎక్కు పెట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు జోష్ లో మాట్లాడడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంలో ఉన్నారు.