జగన్ తెస్తున్న అప్పు లెక్కలు.. వింటే వల వల ఏడుపులే 

Jaganmohan Reddy making history
వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపున వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ జనం మన్ననలు పొందుతుంటే ఇంకోవైపు తీవ్రస్థాయిలో విమర్శలను  ఎదుర్కొంటోంది. అదే ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం.  ఒక వర్గం ప్రజానీకంపై జగన్ పాలన తీరు మీద ఈ విమర్శలే గుప్పిస్తున్నారు.  రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని వాపోతున్నారు.  ప్రతిపక్షాలు, ఆర్ధిక, రాజకీయ నిపుణులు కూడ ఇదే అంటున్నారు.  మరి ఇంతమంది ఇన్ని రకాలుగా అప్పుల విషయంలో ఆందోళన చెంతున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే కదా.  ఒక పనిచేస్తే  జరిగే మంచితో పాటు జరగబోయే నష్టాన్ని కూడ దృష్టిలో ఉంచుకోవాలి.  అప్పుడే పనిచేసేవారి సమర్థత బయటపడుతుంది.  
CAG report on YS Jagan government debts
CAG report on YS Jagan government debts
జగన్ ఇబ్బడిముబ్బడిగా అప్పులైతే తీసుకొస్తున్నారు కానీ రాష్ట్రం మీద పడుతున్న ఆర్ధిక భారాన్ని పట్టించుకోవట్లేదు.  ఎంతసేపూ పంచుతున్న లెక్కలే చెబుతున్నారు తప్ప పెరుగుతున్న అప్పుల గురించి మాట్లాడట్లేదు.  ప్రభుత్వం పథకాల రూపంలో పంచుతున్న డబ్బు దాదాపు 90 శాతం అప్పులు తెచ్చినదే.  అలాంటప్పుడు ఆ అప్పుల లెక్కలకు కూడ సంక్షేమ పథకాలకు ఇచ్చుకున్నంత పబ్లిసిటీ ఇవ్వాలి కదా.  ఇప్పడు ఏ జనమైతే లబ్దిని పొందుతున్నారో రేపు ఆ జనమే ఆ అప్పుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదేదో వారికి సంబందించని విషయమైతే కాదు. కాబట్టి వారికి అప్పుల వివరాలు చెప్పి తీరాలి. కానీ ప్రభుత్వం చెప్పట్లేదు. దాచిపెడుతుంది. 
 
తాజాగా కాజీవిడుదల చేసిన నివేదిక మాత్రం అప్పుల లెక్కల్ని పరిచి మరీ చూపించింది.  2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్రం అప్పులు 97,000 కోట్లు.  చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక ప్రతి యేటా అప్పులు చేశారు.  అలా ఐదేళ్ళలో ఆయన తీసుకొచ్చిన అప్పులు 1. 62 లక్షల కోట్లు.  అలా 2019లో వారి ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పులు 2.59 లక్షల కోట్లు.  ఇక జగన్ పీఠం ఎక్కాక ఒకటిన్నర ఏడాదిలో 1.62 లక్షల కోట్ల అప్పు తెచ్చినట్టు కాగ్ చెబుతోంది.  అంటే బాబు ఐదేళ్ళలో చేసిన అప్పు కంటే జగన్ ఒకటిన్నర సంవత్సరంలో చేసిన అప్పులే ఎక్కువ.  అంటే నెలకు 8000 కోట్లకు పైనే అప్పులు చేశారు. 
 
అయితే ఈ అప్పులు నిబంధనలకు విరుద్దంగా చేసినవైతే కాదు.  కేంద్రం పలు వెసులుబాట్లు కల్పించింది.  వారు చెప్పిన వ్యవసాయ బోర్లకు మీటర్లు, పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు లాంటి షరతులను అమలుచేస్తే అప్పు ఎక్కువ తీసుకోవచ్చని వీలు కల్పించింది.  వాటిని అమలుచేయడానికి ఒప్పుకుని జగన్ సర్కార్ అప్పులు  తెచ్చుకుంటోంది.  భవిష్యత్తులో కూడ ఇలాగే అప్పులు చేస్తూ పోతే జగన్ టర్మ్ ముగిసేనాటికి రాష్ట్రం మీద 6 లక్షల కోట్ల అప్పుల భారం పడిపోతుందని నిపుణుల అంచనా.  అదే జరిగే తర్వాత ఏర్పడే ప్రభుత్వాలకు   పాలన చేయడం అంత ఈజీ కాదు.  తెచ్చే అప్పుల్లో ఆధిక భాగం అభివృద్ధికి, ఆదాయ మార్గాల ఏర్పాటుకు వెచ్చించినప్పుడే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.  కనీసం సంక్షేమంతో సమానంగా అయినా ఆదాయ మార్గాల కోసం వెచ్చించాలి.   అలా కాకుండా పంచడానికే సర్వం ఖర్చు చేస్తే భవిష్యత్తుకు భరోసా కరువై జనం విలవిలలాడుతారు.